Mega Genomic Project | వాషింగ్టన్ : మనిషి ఒక రకమైన కోతి జాతి నుంచి పరిణామం చెందుకుంటూ వచ్చాడని చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం చెప్తున్నది. ఆధునిక జీవశాస్త్రంలోనే ఈ సిద్ధాంతం చాలా మార్పులు తెచ్చింది. మూఢ నమ్మకాలను విభేదించడంలో డార్విన్ సిద్ధాంతం కీలక పాత్ర పోషించింది. మనిషిని దేవుడు సృష్టించాడనే సృష్టివాదాన్ని బలంగా వ్యతిరేకించింది. ఈ సిద్ధాంతం నిజామా? కాదా? అనేదానిపై వివాదాలు కొనసాగుతున్నాయి. కొంతమంది శాస్త్రవేత్తల ‘మెగా జీనోమిక్ ప్రాజెక్ట్’ ఇందుకు సంబంధించిన కొన్ని పక్కా ఆధారాలను కనుగొన్నది. జన్యుపరంగా మనుషులకు, జంతువులకు ఉన్న దగ్గరి సంబంధాన్ని శాస్త్రీయంగా గుర్తించింది.
మనుషులకు, జంతువులకు మధ్య జన్యుపరంగా ఎలాంటి సంబంధం ఉన్నదో తెలుసుకొనేందుకు శాస్త్రవేత్తల బృందం ‘మెగా జీనోమిక్ ప్రాజెక్ట్’ను చేపట్టింది. ఇందులో భాగంగా 100 మిలియన్ ఏండ్ల నుంచి మానవులతో సహా గబ్బిలాల నుంచి అడవి దున్న వరకు మొత్తం 240 క్షీరదాల్లోని జన్యు డాటాను పోల్చింది. జీవ పరిణామ క్రమం నుంచీ ఈ క్షీరదాల్లోని జన్యువుల్లో కొంత మేర మార్పులేకుండా అలాగే కొనసాగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మనుషులు, కొన్ని రకాల జంతువుల్లో 10 శాతం జన్యువులు ఒకేలా ఉన్నట్టు కనుగొన్నారు. అంటే జంతువులకు, మనుషులకు చాలా దగ్గర సంబంధం ఉన్నదని తేల్చారు. ఇందులోని ఒక శాతం జన్యువుల్లో కణాల కార్యకలాపాలను నియంత్రించే ప్రొటీన్ ఉత్పత్తి జరుగుతున్నట్టు కనుగొన్నారు. కొన్ని రకాల జంతువులు వాటి పూర్వీకులతో పోల్చినప్పుడు చాలా మార్పులకు లోనైనట్టు కనుగొన్నారు.
తమ పరిసరాలకు తగ్గట్టు మార్పు చెందుతున్నాయని తేల్చారు. పర్యావరణ వ్యవస్థలోనూ జీవించేందుకు అనుగుణంగా క్షీరదాలు తమను తాము మార్పు చేసుకొన్నట్టు గుర్తించారు. చింపాంజీలు, మనుషుల్లో కొంతమేర డీఎన్ఏ లోపించండం జన్యు వ్యక్తీకరణలోనే భారీ మార్పులు తీసుకొచ్చిందని, మనుషుల్లో మెదడు అభివృద్ధికి కారణమైందని కనుగొన్నారు. 1925లో అలస్కాలోని నోమ్‌కు అత్యంత కఠిన పరిస్థితుల్లో డిఫ్తీరియా సీరమ్‌ను మోసుకెళ్లి చాలా మంది యువకుల ప్రాణాలు కాపాడిన బాల్టో అనే కుక్కలోని జన్యువుల డాటాను పరిశోధకులు విశ్లేషించారు. ఇతర కుక్కుల జాతులతో పోల్చినప్పుడు బాల్టో కుక్క జన్యుపరంగా వైవిధ్యం కలిగి ఉన్నదని గుర్తించారు. ఈ కుక్క అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకొనే జన్యు వైవిధ్యం కలిగి ఉన్నదని కనుగొన్నారు.