పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సౌదీ అరేబియాలోని ఓ ప్రార్ధనా మందిరం దగ్గర పాక్ ప్రస్తుత ప్రధాని షాహబాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా ఇమ్రాన్ నినాదాలు చేశారన్నది ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఇమ్రాన్‌తో పాటు మరో 150 మందిపై కూడా కేసులు నమోదయ్యాయి.
ఈ ఆరోపణలపైనే మాజీ ప్రధాని ఇమ్రాన్‌ను పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని పాక్ మీడియా పేర్కొంది. పాక్ హోం మంత్రి రాణా సనవుల్లాకు సంబంధించిన మీడియా రిపోర్టుల్లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. సౌదీ అరేబియాలోని ప్రార్థనా మందిరం దగ్గర ప్రధాని షాహబాజ్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన కేసులో ఇమ్రాన్ అరెస్టవుతారని స్పష్టంగా పేర్కొన్నారు.
ఏం జరిగింది?
సౌదీ అరేబియాలోని ప్రార్థనా మందిరం దగ్గర మాజీ ప్రధానితో సహా మరో 150 మంది ప్రధాని షాహబాజ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని కేసు నమోదు చేశారు. పాక్ ప్రధాని షహబాజ్నుద్దేశించి కొందరు దొంగ.. దొంగ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోల ఆధారంగా పంజాబ్ పోలీసులు కేసులు పెట్టారు. ఇక మాజీ మంత్రులు ఫవాద్ చౌదరి, షేక్ రషీద్, షహబాజ్ గుల్‌తో సహా పలువురు ప్రముఖులు కూడా వున్నారు.
వివరణ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్..
పంజాబ్ పోలీసులు కేసులు నమోదు చేయడంతో మాజీ ప్రధాని ఇమ్రాన్ వివరణ ఇచ్చారు. ప్రధాని షాహబాజ్ను ఉద్దేశించి ఎలాంటి నినాదాలూ చేయలేదని స్పష్టం చేశారు. కానీ ప్రజలే… స్వచ్ఛందంగా నినాదాలు చేశారని పేర్కొన్నారు. అంతే తప్ప నినాదాలు చేయాలంటూ తాను ఎవ్వర్నీ ప్రోత్సహించలేదని, ప్రజల్లో ఆగ్రహం వచ్చే, వారే స్వతంత్రంగా నినాదాలు చేశారని ఇమ్రాన్ వివరణ ఇచ్చారు.