బీజింగ్ : రోబోల టెక్నాలజీ విషయంలో చైనా దూసుకుపోతున్నది. ఇప్పటి వరకు మైదానాలు, ఖాళీ స్థలాల్లోనే ముందే నిర్దేశించిన పనులు చేయించేవారు. బుధవారం రోబోలకు ముందస్తు ఏర్పాట్లు లేని ఇంట్లో పనులపై సెకండ్ వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్ పేరుతో పోటీలు నిర్వహించారు. ఇందులో పలు కంపెనీలకు చెందిన రోబోలు పాల్గొన్నాయి. లివింగ్ రూమ్‌ను సర్దడం, బెడ్రూమ్లో బట్టలు సర్దడం, బాత్రూమ్లో బట్టలు ఉతికి బాల్కనీలో ఆరేయడం లాంటి మూడు పనుల్లో 300 పాయింట్లకు పోటీ నిర్వహించారు.
ఈ పనులు చేస్తూనే మధ్యలో పార్సిల్ వస్తే తీసుకుని ఇంట్లో పెట్టి మళ్లీ తమ పనులను రోబోలు కొనసాగించాలి. ఈ పనులు చేసే క్రమంలో ఇంట్లోని ఇతర వస్తువులను ఢీ కొట్టినా, చేతిలోని వస్తువులు కింద పడ్డా, నిర్దేశించిన హద్దులు దాటినా ఈ రోబోలు పాయింట్లు కోల్పోతాయి. ఈ పోటీల ద్వారా రోబోలు కేవలం నిర్దేశించిన పనులనే కాకుండా మనుషుల మాదిరిగా గందరగోళ పరిస్థితుల్లో ఇంట్లోని పనులు చేయగలవని నిరూపించడమే లక్ష్యం అని నిర్వాహకులు తెలిపారు.