H-1B workers : మెటా, అమెజాన్ సహా అనేక టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలోని కంపెనీల్లోనూ ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. ఇలా ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో భారతీయులు కూడా ఉన్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వేలమంది భారతీయులు ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పుడు వారి సమస్య ఉద్యోగమే కాదు.. అమెరికా ఆవాసం కూడా. ఎందుకంటే ఉద్యోగాలు కోల్పోయిన వారు దేశంలో చట్టబద్ధంగా ఉండేందుకు ఉన్న హక్కును కోల్పోతారు.
ఉద్యోగం లేకుంటే హెచ్1బీ వీసా రద్దవుతుంది. ఇదే జరిగితే వేలాది మంది భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతాయి. అమెరికాలో ఎదగాలని ఆశలు పెట్టుకున్న ఎంతోమంది భారతీయులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. ఇటీవల అమెజాన్, మెటా, ఒరాకిల్ వంటి అనేక సంస్థలు వరుసగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇలా జాబ్ కోల్పోయిన వారి హెచ్1బీ వీసా స్టేటస్ రద్దవుతుంది. అయితే, వీరికి అక్కడి నిబంధనల ప్రకారం.. హెచ్1బీ వీసా హక్కు తిరిగి పొందాలంటే ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజుల్లోగా తిరిగి ఉద్యోగం పొందాలి. ఇది గ్రేస్ పీరియడ్. ఈ కాలంలోపు ఉద్యోగం పొంది స్పాన్సర్షిప్ పొందితేనే అమెరికాలో ఉండటానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ 60 రోజుల్లో ఉద్యోగం పొందకపోతే అలాంటివారిని గుర్తించి, బలవంతంగానైనా అమెరికా నుంచి పంపించి వేస్తారు. ప్రస్తుతం లేఆఫ్స్ వల్ల భారతీయులు లక్షలాదిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఏళ్లుగా అక్కడ పని చేస్తున్నారు. కొందరు ఇంటి కోసం లోన్లు తీసుకున్నారు. పిల్లల్ని అక్కడే చదివిస్తున్నారు. పర్మినెంట్ నివాసం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో అక్కడ ఉద్యోగాలు కోల్పోతుండటం తీవ్రంగా కలవరపెడుతోంది. అయితే, ఇలా ఉద్యోగాలు కోల్పోతున్న వారు మరికొంతకాలం అమెరికాలో ఉండి ఉద్యోగం వెతుక్కునేందుకు వీలుగా ప్రస్తుతం తాత్కాలికంగా బీ–2 విజిటర్ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఇటీవలి కాలంలో ఈ వీసాల కోసం దరఖాస్తులు భారీగా పెరిగిపోయాయి. ఈ వీసాలు పొందితే అమెరికాలో మరో ఆరు నెలలపాటు ఉండే అవకాశం దొరుకుతుంది. కానీ, దీనివల్ల కూడా అక్కడ అనేక న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ వీసాలు పొందడం కూడా కష్టంగా మారుతోంది. ఇందుకోసం అనేక డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అమెరికాలోని కంపెనీల్లో ఈ ఏడాదిలోనే 1,10,000 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.