ఒరెంగుటాన్లు చింపాజీని పోలి ఉంటాయి. అచ్చం మనిషిలాగే ప్రవర్తిస్తాయి. మనిషిలా అరటిపండ్లు ఒలుచుకుని తినడంతోపాటు బాధ కలిగినప్పుడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తాయి. ఓ అడుగు ముందుకేసిన ఒరెంగుటాన్ మనిషిలాగా తాపీగా కూర్చొని సిగరెట్ తాగుతోంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలే అంతరించిపోయే దశలో ఉన్న ఒరెంగుటాన్ సిగరెట్ తాగడం జంతు ప్రేమికులను ఆగ్రహానికి గురిచేసింది.
ఈ వీడియోను వియత్నాంలోని హోచిమిన్ సిటీలోగల సైగాన్ జూ, బొటానికల్ గార్డెన్స్‌లో తీశారు. ఈ వీడియోలో ఒరెంగుటాన్ నేలపై కూర్చొని ఉంది. సిగరెట్‌ను అచ్చం మనిషిలాగే రెండు వేళ్లతో పట్టుకుని తాగుతోంది. ఓ సందర్శకుడు పడేసిన సిగరెట్‌ను ఒరెంగుటాన్ తీసుకొని తాగిందని, జూ సిబ్బంది దానికి సిగరెట్ ఇవ్వలేదని నిర్వాహకులు స్పష్టంచేశారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది. జూ నిర్వాహకులు స్పష్టతనిచ్చినా జంతు ప్రేమికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ జీవిని హానికరమైన పదార్థానికి బానిసలుగా చేశారని మండిపడ్డారు.