Usha Vance : అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) కు తాను ఒక నమ్మకమైన సలహాదారుగా వ్యవహరిస్తానని ఆయన సతీమణి ఉషా వాన్స్ (Usha Vance) వెల్లడించారు. వ్యక్తిగత విషయాల్లో తన అభిప్రాయాన్ని తన భర్త తప్పకుండా తీసుకుంటారని అన్నారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉష ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు నచ్చని విషయంలో తాను తన భర్తతో ఏకీభవించను అని చెప్పారు.
ఒక్కోసారి అలాంటి నిర్ణయాలు కూడా విశాల దృక్పథంతో ఆలోచించేలా చేస్తాయని ఉషా వాన్స్ అన్నారు. ఆయన ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ‘ఆయన దేనిపై దృష్టిపెట్టాడు, ఏం చేయాలనుకుంటున్నాడో నేను తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది వివాహ బంధం. ప్రతి పనిలోనూ నా భర్తకు అండగా ఉండి సాయం చేయాలనుకుంటా. ఒకవేళ నాకు ఆయన ఏం చేస్తున్నాడో తెలియకపోతే మరి సాయం చేయడం ఎలా సాధ్యమవుతుంది’ అని ఉషా వాన్స్ పేర్కొన్నారు.
తన భర్త చుట్టూ ఎంతోమంది సలహాదారులు, భద్రతా సిబ్బంది ఉన్నా.. ఇబ్బందిపెట్టే అంశాలు, వ్యక్తిగత విషయాలు పంచుకోవాలంటే తన దగ్గరికే వస్తారని చెప్పారు. అలా అని తాను ఆయన సహోద్యోగిని కాదని, పని విషయాల్లో జోక్యం చేసుకోనని, మా ఇద్దరికీ ఒకేరకమైన అభిప్రాయం ఉండాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. ఏదీ దాచుకోకుండా స్వేచ్ఛాయుతంగా ఒకరి అభిప్రాయాలను ఒకరం పంచుకుంటామని చెప్పారు. ఇలా చేయడం మనల్ని ప్రేమించేవారి, మనం ప్రేమించి వారి ఎదుగుదులకు ఉపయోగపడుతుందని చెప్పి తన భర్తతో ఉన్న అనుబంధాన్ని ఉష పంచుకున్నారు.