Commercial LPG Price | దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెంచాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై రూ.195 నుంచి రూ.218 వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఐదు కిలోల మినీ సిలిండర్‌పై రూ.51 పెంచారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా సవరణల తర్వాత ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,078.50కి చేరగా.. ముంబైలో రూ.2,031కి పెరిగింది. ఈ రెండు నగరాల్లోనూ రూ.195.5 మేర ధర పెంచారు. ఇక కోల్‌కతాలో రూ.218 పెంచడంతో వాణిజ్య సిలిండర్ ధర రూ.2,208కి చేరింది. చెన్నైలో రూ.203 పెంచడంతో రూ.2,246గా నమోదైంది. ఇక హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.214.50 పెరిగింది. దీంతో ధర రూ.2,321కి చేరింది.
సాధారణంగా అంతర్జాతీయ ప్రమాణాలు, రూపాయి మారకం విలువ వంటి అంశాలను చమురు సంస్థలు సమీక్షించి ప్రతి నెల 1వ తేదీన ధరలను సవరిస్తుంటాయి. ఈ క్రమంలోనే వాణిజ్య సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి. గత నెలలో కూడా వాణిజ్య సిలిండర్ ధరను రూ.114.50కి పెంచిన సంగతి తెలిసిందే. ఈ ధరలు హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న పరిశ్రమలపై భారీ ప్రభావం చూపనుంది. అయితే గృహ వినియోగదారులకు మాత్రం ఈ నెలలో కాస్త ఉపశమనం లభించినట్లయ్యింది. డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు.