మనం ప్రతి రోజూ ఏదో ఒక చోట చీమలను చూస్తూనే ఉంటాం. కుడితే చటుక్కున ఒక్క దెబ్బ వేసి వాటిని స్వర్గానికి పంపేస్తుంటాం. అయితే ఎప్పుడైనా చీమలు ఎలా ఉంటాయో ఆలోచించామా? అంటే చిన్నగా ఉంటాయని కాదు. వాటిని క్లోజప్‌లో చూస్తే ఎలా ఉంటుందని ఆలోచించామా? లేదు కదా.
అదే ఆలోచన వచ్చింది లిథువేనియాకు చెందిన యూజెనీయస్ కవలియాస్కాస్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌కు. ఇంకెందుకు ఆలస్యం అనుకున్నాడు. మైక్రోస్కోప్ ముందు ఒక చీమను పెట్టి దాని క్లోజప్ ఫొటో తీశాడు. దాన్ని ‘2022 నికాన్ స్మాల్ వరల్డ్ ఫోటోమైక్రోగ్రఫీ కాంపిటీషన్’కు పంపాడు. ఈ ఫొటోకు ప్రైజ్ రాలేదు కానీ.. ఇది చూసిన నెటిజన్లు దడుసుకొని చస్తున్నారు.
కుడితే ఒక్క దెబ్బకు స్వర్గానికి పోయే చీమ ఇంత భయంకరంగా ఉందేంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఇది చూసిన ఒక నెటిజన్ ‘డ్రాగన్లు మాయమైపోయాయని ఎవరన్నారు? అవి ఇలా చిన్నగా అయిపోయాయంతే’ అని కామెంట్ చేయగా.. ‘ఇదేదో భయంకరమైన హారర్ సినిమాలో సీన్లా ఉంది’అని మరొకరు అన్నారు. ‘ఇవి చీమలు కాబట్టి సరిపోయింది. అదే భారీ సైజులో ఉండే జెయింట్స్ అయితే మన పరిస్థితి ఏంటి?’ అని ఒకరు ప్రశ్నించారు. మీరు కూడా ఈ ఫొటో చూసి ఎలా ఉందో చెప్పండి.