శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఇమానీ మైల్ అనే బాలిక వయసు 12 ఏండ్లు. ఎప్పుడూ చలాకీగా ఉంటుంది. హుషారుగా మాట్లాడుతుంది. అలాంటి పిల్లకు అనారోగ్యం ఉందని ఎవరూ ఊహించరు. కానీ ఆ బాలిక చేతికి ధరించిన యాపిల్ వాచ్ మాత్రం ఆమె ఆరోగ్యం బాగా లేదని కనిపెట్టింది. వాచ్ లాంగ్ బీప్ సౌండ్ చేసి ఒక్కసారిగా ఆగిపోవడంతో భయపడిన మైల్ కుటుంబం అప్రమత్తమైంది.
వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ మైల్కు పరీక్షలు చేసిన వైద్యులు అపెండిక్స్లో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆ కణితి అప్పటికే బాడీలో స్ప్రెడ్ అవుతున్నదని, వెంటనే ఆపరేషన్ చేసి తొలగించాలని చెప్పారు. మైల్ కుటుంబం అంగీకరించడంతో సర్జరీ చేసి ఆ కణితిని తొలగించారు. బాలిక ప్రాణాలు కాపాడారు. మైల్లో కనిపించింది న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అని, ఈ సమస్య చిన్నపిల్లల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుందని వైద్యులు తెలిపారు.
కాగా, యాపిల్ వాచ్ను తాము ఇప్పుడు గాడ్జెట్లా కాకుండా అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్నామని మైల్ తల్లి జెస్సికా కిచెన్ చెప్పారు. మైల్ చేతికి ఉన్న వాచ్ వరుసగా బీప్ శబ్ధం చేయడంతో తాను అందులోని నోటిఫికేషన్స్ ఫీచర్ చూడగా హార్ట్ రేట్ అధికంగా ఉందని, ఆ వెంటనే వాచ్ కూడా పూర్తిగా ఆగిపోవడంతో భయపడి ఆస్పత్రికి తీసుకెళ్లామని తెలిపారు.
యాపిల్ వాచ్ అలర్ట్ చేసి ఉండకపోతే మైల్ మాకు దక్కేది కాదని జెస్సికా చెప్పారు. వాచ్ ఆగిపోకపోతే వెంటనే ఆస్పత్రికి వెళ్లేవాళ్లం కాదని, రెండు మూడు రోజులు ఆలస్యం చేస్తే ప్రాణాల మీదకు వచ్చేదని అన్నారు. ఈ విధంగా మైల్ ప్రాణాలు కాపాడిన క్రెడిట్ మొత్తం యాపిల్ వాచ్కే దక్కింది. కాగా, గత జూన్లో 34 ఏండ్ల మహిళలో ప్రెగ్నెన్సీని గుర్తించడంలో, జూలైలో ఓ మహిళ గుండెలో కణితిని గుర్తించడంలో కూడా యాపిల్ వాచ్ తోడ్పడింది.