ఆక్రా: వృద్ధుడైన మత పెద్ద 12 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఒక వర్గానికి ముఖ్య ఆధ్యాత్మిక అధిపతి అయిన 63 ఏళ్ల వయసున్న ఆయన చర్యపై వివాదం చెలరేగింది. (Priest Marries Girl) బాల్య వివాహాన్ని విమర్శించిన పలువురు ఆ పెళ్లిని రద్దు చేయాలని, ఆ పూజారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనాలో ఈ సంఘటన జరిగింది. 63 ఏళ్ల నుమో బోర్కేటీ లావే సురు 33, దేశీయ నంగువా వర్గానికి మతాధికారి, ప్రధాన పూజారిగా ఉన్నారు. శనివారం ఆ దేశ రాజధాని ఆక్రాలో జరిగిన సంప్రదాయ కార్యక్రమంలో గుర్తు తెలియని 12 ఏళ్ల బాలికతో ఆయన పెళ్లి జరిగింది.
కాగా, ఘనాలో వివాహానికి చట్టబద్ధమైన కనీస వయస్సు 18 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ పూజారి 12 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చట్టవిరుద్ధంగా జరిగిన ఈ వివాహాన్ని రద్దు చేయాలని, ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని ఘనాకు చెందిన కొందరు ప్రజలు డిమాండ్ చేశారు.
మరోవైపు ఆ మత పెద్ద చర్యను ఆ వర్గం నేతలు సమర్థించారు. పూజారి భార్యగా ఆ బాలిక పాత్ర పూర్తిగా సంప్రదాయమని తెలిపారు. పూజారి భార్య కావడానికి ఆ బాలిక ఆరేళ్ల వయసులోనే సంబంధిత ఆచారాలను ప్రారంభించిందని చెప్పారు. దీని వల్ల ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం కలగలేదని అన్నారు.
కాగా, ఆ మత పెద్ద పెళ్లాడిన బాలికను గుర్తించి తమ సంరక్షణలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి కూడా ఆ బాలికతో పాటు ఉన్నదని చెప్పారు. అయితే ఈ వివాదస్పద వివాహంపై ఘనా ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.