న్యూయార్క్: అమెరికాలో అక్రమంగా జీవిస్తూ కమర్షియల్ ట్రక్కు డ్రైవర్లు(Truck Drivers)గా పనిచేస్తున్న సుమారు 30 మంది భారతీయులను అరెస్టు చేశారు. ఫెడరల్ ఆపరేషన్లో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్రక్కు డ్రైవర్లను త్వరలో డిపోర్టు చేయనున్నారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. మే 11 నుంచి 15వ తేదీ మధ్య జరిగిన ఆపరేషన్ చెక్మేట్లో భాగంగా అక్రమ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది. ఆరిజోనాలోని యుమా సెక్టార్లో ఉన్న బోర్డర్ పెట్రోలింగ్ ఏజెంట్లు ఆ డ్రైవర్లను అరెస్టు చేశారు. మొత్తం 52 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో 36 మందిని సెమీ ట్రక్కు డ్రైవర్లుగా గుర్తించారు. వారిలో 30 మంది భారతీయులుగా తేల్చారు. మిగితా ఆరుగురిలో మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యాకు చెందిన వారు ఉన్నారు. కొందరికి కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియా రాష్ట్రాలకు చెందిన కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి.