వాషింగ్టన్: న్యూ ఇయర్ వేడుక (New year party)జరుగుతున్నది. అంతా మంచి జోష్లో ఉన్నారు. మరో రెండు నిమిషాల్లో కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతున్నారు. చుట్టుపక్కల పటాకులు పేలుతున్నాయి. కానీ అక్కడ మాత్రం తుపాకులు మోగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన అమెరికాలోని మిసిసిపీలో జరిగింది.
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిసిసిపీలోని గల్ఫ్పోర్టులో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కొత్త సంవత్సరం వేడుక జరుగుతుండగా శుక్రవారం రాత్రి 11.58 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా జనాలపైకి కాల్పులు జరిపారని అధికారులు వెల్లడించారు. దుండగుల కోసం గాలిస్తున్నామని, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు.