సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నెలకొల్పిన ఉమెన్ ఆంత్రప్రెన్యూర్స్ హబ్(వీ హబ్) సత్ఫలితాలను ఇస్తున్నది. దేశంలోనే తొలిసారిగా..మంత్రి కేటీఆర్ ఆలోచనలకు రూపమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నాటిన విత్తనమే ‘వీ హబ్. 2018 మార్చిలో ఆవిర్భవించిన ‘వీ హబ్’ మహావృక్షంగా ఎదిగి మహిళలకు ప్రతి ఫలాలను అందిస్తున్నది. గడిచిన నాలుగేళ్లలో వీ హబ్‌లో మొత్తం 5,235 స్టార్టప్‌లు రిజిస్ట్రేషన్ కాగా.. 4,527 స్టార్టప్‌లకు సపోర్టు చేసింది. 2,194 స్టార్టప్‌లు వీ హబ్‌లోనే ఇంక్యుబేట్ అవుతున్నాయి. బ్యాంకు లింకేజీలు, ఈక్విటీ ఫండింగ్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ తదితరాల ద్వారా రూ.85.21కోట్లను స్టార్టప్‌లకు సమకూర్చింది. నిత్యావసర వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, చేనేత వస్త్ర, దుస్తుల తయారీ, ఆరోగ్య, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన అనేక స్టార్టప్‌లు వీ హబ్‌లో ఇంక్యుబేట్ అవుతున్నాయి. టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్, ఫుడ్ ప్రాసెసింగ్, హ్యాండిక్రాఫ్ట్స్ వంటి రంగాల్లోనూ మహిళా ఆంత్రప్రెన్యూర్స్‌ను ఇంక్యుబేట్ చేస్తోంది.
విద్యార్థి దశ నుంచే ప్రోత్సహించేలా..
యువతులను విద్యార్థి దశ నుంచే ఆంత్రప్రెన్యూర్‌షిప్ దిశగా ప్రోత్సహించేందుకు వీ హబ్ కృషిచేస్తున్నది. 13 నుంచి 17 సంవత్సరాల యువత కోసం ఎస్టీఈ(ఏ)ఎం ప్రోగ్రాంలో భాగంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్‌లో నైపుణ్యాలను పెంపొందిస్తోంది. ప్రస్తుతం 1,247 మంది విద్యార్థులను ప్రోత్సహించి స్టార్టప్‌లను నెలకొల్పే దిశగా ‘వీ హబ్’ తోడ్పాటు అందిస్తున్నది.
వివిధ వర్గాలకు తోడ్పాటు..
ఒక్క కరీంనగర్‌లోనే 343 మంది దళితబంధు ద్వారా యూనిట్లను ప్రారంభించుకునేందుకు సహకరించి వీ హబ్ వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దింది. ట్రైకార్ ద్వారా గిరిజన ఔత్సాహిక మహిళలకు, మైనార్టీ మహిళలకు ‘ఉజాగర్’ కార్యక్రమంలో అకౌంటింగ్, మార్కెటింగ్ వంటి వాటిపై నైపుణ్యం కల్పించి గ్లోబల్ మార్కెట్లో వ్యాపార వేత్తలుగా ఎదిగేందుకు వీ హబ్ ద్వారా సహకారం అందిస్తున్నారు.
‘వీ హబ్’ నా సంకల్పాన్ని నెరవేర్చింది
ఫార్మసీలో ఓయూ నుంచి పీహెచ్డీ పూర్తి చేసిన నాకు వ్యాపారం చేయాలనే సంకల్పం ఉండేది. కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ లేకుండా అలోవేరా, ఆమ్లా జ్యూస్‌లను ఇంట్లోనే తయారు చేస్తున్న నాకు ‘వీ హబ్’ బిజినెస్ మెళకువలపై అవగాహన కల్పించింది. ప్రస్తుతం 21 రకాల ఉత్పత్తులను కస్టమర్లకు అందిస్తున్నా. ‘వీ హబ్’ పెట్టుబడికోసం అందించిన రూ.లక్షతోనే వ్యాపారాన్ని మొదలుపెట్టాను. ప్రభుత్వ సహకారం మరువలేనిది.
– గజ్జల కల్పన, సుకల్ప సంస్థ వ్యవస్థాపకురాలు
ప్రభుత్వానికి హ్యాట్సాప్..
ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయడమే కాకుండా ‘వీ హబ్’ ద్వారా వ్యాపార వేత్తలుగానూ తీర్చిదిద్దుతున్నది. హ్యాట్సాప్ తెలంగాణ గవర్నమెంట్. ‘వీ హబ్’ సహకారంతో ‘టిక్స్ రోబోటిక్స్’ సంస్థ స్థాపించి రోబో ఎడ్యుకేషన్‌పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాను. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తుండటం శుభ పరిణామం.
– దేవులపల్లి ప్రసూన, టిక్స్ రోబోటిక్స్ వ్యవస్థాపకురాలు