రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు భద్రత లేకుండాపోయింది. విద్యాశాఖమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి.. విద్యావ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై ఏనాడు స్పందించడం లేదు’ అని విద్యాశాఖ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై ఉన్న అక్కసుతో గురుకుల వ్యవస్థను భ్రష్టుపట్టించిందని విమర్శించారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్‌గూడ సమీపంలోని జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాలలో ‘గురుకులంలో కామ పిశాచి’ శీర్షికన నమస్తేతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆమె రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి మంగళవారం గురుకులాన్ని సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గురుకులాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. యూనిఫారాలు, కాస్మోటిక్ చార్జీలు, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో ఇవ్వకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
చర్లపటేల్గూడలోని జ్యోతిరావుఫూలే బాలికల హాస్టల్లో సుమారు 2 వేల మంది విద్యార్థినులు ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో సిబ్బంది సైతం మహిళలే ఉండాల్సినప్పటికీ ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌ను పురుషుడిని నియమించారని, అతని వికృత చేష్టల వల్ల విద్యార్థినులు, ఉపాధ్యాయులు కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఈ విషయం ప్రిన్సిపల్‌కు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థినులకు వడ్డిస్తున్న అన్నంలో పురుగులు వస్తున్నాయని, పలుమార్లు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వటం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. నాలుగునెలల క్రితం ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థిని హాస్టల్ భవనం నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు యత్నించిందని, అందుకు సంబంధించిన కారణాలను ఇప్పటి వరకు బయటకు తీయలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సంక్షేమ హాస్టళ్లలో ఎలుకలు విద్యార్థినులను కరుస్తున్నాయని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు.