రక్తమోడుతున్న ఓఆర్ఆర్
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వాహనదారులకు ఔటర్ రింగు రోడ్డు మృత్యు మార్గంగా మారిపోయింది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న.. సమీక్షల పేరిట హైదరాబాద్ గ్రోత్ కారిడార్ హడావుడి చేస్తుందే తప్పా.. ప్రమాదాల నియంత్రణకు అడ్డుకట్ట వేయడంలో విఫలం అవుతుంది.
- రెండు నెలల వ్యవధిలో 18కిపైగా ప్రమాదాలు
- ప్రాణాలు పోతున్నా పట్టించుకోని అధికారులు
- ప్రమాదాలు జరిగినప్పుడే సమీక్షలతో హడావుడి
సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వాహనదారులకు ఔటర్ రింగు రోడ్డు మృత్యు మార్గంగా మారిపోయింది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న.. సమీక్షల పేరిట హైదరాబాద్ గ్రోత్ కారిడార్ హడావుడి చేస్తుందే తప్పా.. ప్రమాదాల నియంత్రణకు అడ్డుకట్ట వేయడంలో విఫలం అవుతుంది. గడిచిన రెండు నెలల వ్యవధిలోనే దాదాపు 18కి పైగా ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలను కోల్పోయారంటే ఓఆర్ఆర్ నిర్వహణ లోపం ఏ స్థాయికి చేరిందనేది తెలిసిపోతుంది. కానీ అధికారులు మాత్రం ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన ప్రమాణాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
నగరం చుట్టూ విస్తరించి ఉన్న 158 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు ఇప్పుడొక యాక్సిడెంటల్ డెస్టినీగా
మారిపోయింది. కోర్ సిటీలో రవాణా రద్దీని తగ్గించడంలో కీలకంగా మారిన ఔటర్‌పై జరుగుతున్న
ప్రమాదాలకు సాంకేతిక తప్పిదాలేనని అనుమానాలు ఉంటే, మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాల్లో
అధికారుల పర్యవేక్షణ లోపం కీలకంగా మారింది. ఈ క్రమంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో
భద్రత చర్యలను పట్టించుకోవడంలో హెచ్‌జీసీఎల్ మొద్దునిద్ర వీడటం లేదు.
ప్రమాదాలు జరిగిన ప్రతిసారి సమీక్షలతో సరిపెడుతున్న యంత్రాంగం..ప్రమాదాల నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టడంలో పూర్తి విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఔటర్‌పై చోటు చేసుకున్న విషాద ఘటనలకు ప్రధాన కారణం నిర్వహణ లోపాలేనని చెబుతున్నారు. ఈ ఘటనల్లో వాహనదారులే కాకుండా, ఔటర్‌పై పనిచేసే కార్మికులు కూడా మృత్యువాత పడుతున్నారు.
కొల్లూర్ ఎగ్జిట్-2 వద్ద సెంట్రల్ మీడియన్‌లోని మొక్కలకు నీరు పెడుతున్న ఓ కార్మికులు, వాహన డ్రైవర్, వాటర్ ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఇక అమీన్పూర్ ఎగ్జిట్ 4 వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వర్షాల సమయంలో ఔటర్‌పై లోపించిన వెలుతురు కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు రెండు నెలల వ్యవధిలో 18కిపైగా జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నా ఓఆర్ఆర్ నిర్వహణపై అధికారులు దృష్టి సారించడం లేదు.
అధికారుల పర్యవేక్షణ లోపం…
నిర్వహణను పర్యవేక్షించడం గాలికొదిలేసిన హెచ్‌జీసీఎల్ ఉన్నతాధికారులు.. కొట్లాది రూపాయలను టోల్
రూపంలో వసూలు చేస్తున్న ఏజెన్సీలకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిబంధనల
ప్రకారం రోడ్డు భద్రతా ప్రమాణాలను అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కేవలం
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ రోడ్డు భద్రత, నిర్వహణపై లేదని అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.
కాంట్రాక్టర్ల పనులను పర్యవేక్షించకుండా, బిల్లులు మాత్రం చకచకా మంజూరు చేస్తున్నారు. ఇందులో
నిబంధనలు అమలు చేయని ఏజెన్సీలపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. రోడ్డు ఇంజినీరింగ్ లోపాలపై
ఇప్పటివరకు దృష్టి పెట్టని హెచ్‌జీసీఎల్, నిత్యం జరిగే ప్రమాదాలపై సమాధానం చెప్పలేకపోతుంది. స్ట్రీట్
లైట్లు లేకుండా, నాణ్యత లేని మార్కింగులు, కనిపించని హెచ్చరిక బోర్డులతో వాహనదారులు కూడా
ఇబ్బంది పడుతున్నారు.
ఓఆర్ఆర్పై వాటరింగ్..
కొల్లూరు ఘటనలో మొక్కలకు నీరు పోస్తున్న కార్మికుడు మృతి చెందడంతో హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ వేపై వాటర్
ట్యాంకర్లు అడ్డుదిడ్డంగా ఆపడం వలన తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది.నిత్యం రద్దీగా ఉండే హైవేపై
ఎలాంటి రక్షణ ఏర్పాట్లు, బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు లేకుండా కార్మికులను ప్రమాదాల బారిన
పడుతున్నారు. అయితే కోట్ల రూపాయలతో అధునాతన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థకు మరమ్మతులు
చేయడంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. సెంట్రల్ మీడియన్ వాటరింగ్పై కోట్ల
రూపాయలను పక్కదారి పట్టిస్తున్న అధికారులు…మాన్యువల్ విధానంలోనే మొక్కలకు నీళ్లు పెట్టిస్తూ
కార్మికులను ప్రమాదంలో పడేస్తున్నారు.
చర్యలు కరువు..
కొంత కాలంగా ఓఆర్ఆర్పై జరిగే ప్రమాదాలపై అధ్యయనం చేసేందుకు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలనే
డిమాండ్ ఉంది. కానీ ఇప్పటివరకు సమగ్ర భద్రతా ఆడిట్‌ను చేపట్టడంపై హెచ్‌జీసీఎల్ చర్యలు
తీసుకోలేదు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాంట్రాక్టర్లకు జరిమానాలు విధించి, అవసరమైతే కాంట్రాక్టులను
రద్దు చేయాల్సిన అధికారులే… ఏజెన్సీలకు కొమ్ము కాస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన
ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నలకు హెచ్‌జీసీఎల్ అధికారులు నోరుమెదపడం లేదు.
హైవేపే పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్‌లు, హెవీ డ్యూటీ టోయింగ్ క్రేన్లు కూడా ఉండటం లేదని
వాహనదారులు వాపోతున్నారు. సీసీ కెమెరాలు, స్పీడ్ గన్ల ద్వారా ఓవర్ స్పీడింగ్ను కట్టడి
చేయడంతోపాటు, హెవీ వెహికిల్స్ హై స్పీడ్ లేన్లలో ప్రయాణించకుండా కఠిన చర్యలు తీసుకోవడం లేదని
పౌరసమాజం ఆరోపిస్తుంది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఓఆర్ఆర్పై వాహనదారులకు
భద్రతాను గాలికొదిలేసిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి..
ఔటర్‌పై మౌలిక సదుపాయాలను కల్పించడంలో నిర్వహణ, పర్యవేక్షణ లోపం స్పష్టంగా ఉంది. భద్రతా
ప్రమాణాలను గాలి కొదిలేయడంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం ఓఆర్ఆర్పై
నిండుకున్న నిర్లక్ష్యం ఖరీదు ఒక మనిషి ప్రాణం అవుతుంది. తాత్కాలిక సమీక్షలతో ఓఆర్ఆర్పై భద్రత
ఏమాత్రం పెంచదు. కేవలం పటిష్టమైన ప్రణాళిక, శాస్త్రీయ విధానాలతో జరిగే అధ్యయనాలతో నే
ఓఆర్ఆర్పై జరిగే ప్రమాదాలకు పరిష్కారం దొరుకుతుంది.
-విజయభాస్కర్, రోటరీ క్లబ్ డైరెక్టర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

