సిటీబ్యూరో, నవంబర్ 14(నమస్తే తెలంగాణ) : పెండ్లి అనేది ఓ సాంస్కృతిక సార్వజనీన కార్యం. అందునా భారతీయ వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానముంది. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి. మూడు ముళ్ల బంధంతో ఏకమై తమ జీవితాన్ని పండించుకోవాలని పెండ్లి కాని ప్రతి యువతీ యువకుడు కోరుకుంటారు. అయితే కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా వివాహాలు హంగు ఆర్భాటం లేకుండా కొద్ది మంది బంధువుల సమక్షంలో పెండ్లిళ్లు జరిగాయి. కాగా, రెండు నెలల విరామం తర్వాత మార్గశిర మాసంలో శుభ ముహూర్తాలు రావడంతో పెండ్లి బాజాల జోరు హోరెత్తనుంది. ఈ ఒక్క మాసంలోనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా వేల సంఖ్యలో పెండ్లిళ్లు జరగనున్నట్లు వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఫంక్షన్ హాల్స్, బ్యాండ్ మేళం, డెకరేషన్, పూలు పండ్లు, ఫుడ్, ఈవెంట్ ఆర్గనైజర్స్, ఫొటోగ్రాఫర్స్, పూజారులు, ట్రావెల్స్, టెంట్ హౌజ్, గోల్డ్, బట్టల దుకాణాలకు గిరాకీ పెరగనుంది. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడం..నవంబర్ నెల చివరలో వచ్చే మార్గశిర మాసం నుంచి తిరిగి శుభ ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి.
ఒక్క నెలలోనే వేల సంఖ్యలో పెండ్లిళ్లు..
ఈనెల 23తో కార్తిక మాసం ముగిసి మార్గశిర మాసం మొదలుకానుంది. ఈ మాసంలో 2, 3, 8, 12,16, 17, 18 తేదీలలో శుభ ముహూర్తాలు ఉండడంతో వేలాది పెండ్లిళ్లు జరగనున్నాయి. జనవరిలో ముహూర్తాలు లేని కారణంగా వేల జంటలు కల్యాణ తిలకం దిద్దుకునేందుకు రెడీ అవుతున్నారు. . డిసెంబర్ 2న ముహూర్త బలం ఎక్కువగా ఉండడంతో ఆ ఒక్క రోజులోనే వేల సంఖ్యలో పెండ్లిళ్లు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే ఎక్కువ సెలవులు తీసుకుంటుండటం వంటి కారణాల నేపథ్యంలోనూ మార్గశిర మాసంలో పెండ్లిళ్ల్లుఎక్కువగా ఉంటాయని పలు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ముహూర్తాలు సైతం పెట్టుకోవడం పూర్తికావడంతో ఆయా ఇండ్లల్లో పెళ్లి సందడి నెలకొంది.
కిటకిటలాడనున్న ఫంక్షన్ హాళ్లు..
పెండ్లి ముహూర్తాల నేపథ్యంలో నగరంలో ఏ మూలన చూసినా ఫంక్షన్ హాళ్లు కిటకిటలాడనున్నాయి. ఇప్పటికే నగర వ్యాప్తంగా మూడోవంతు కల్యాణ మండపాలు రిజర్వ్‌కాగా.. డెకరేషన్, క్యాటరింగ్‌లకు కూడా అడ్వాన్స్‌లు ఇచ్చారు.
మార్గశిర మాసంలోనే ఎక్కువ ముహూర్తాలు..
మార్గశిర మాసంలో ఏడు రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్ 2న ముహూర్త బలం బాగుందన్న కారణంగా ఎక్కువ వివాహాలు ఆ రోజునే ఉన్నాయి. ముహూర్తాలకు తగ్గట్టుగా పురోహితులు లేకపోవడంతో పురోహితులనైనా సమకూర్చాలని అడుగుతున్నరు.
– సాగి సుబ్రహ్మణ్య శర్మ, పురోహితుడు, హైదరాబాద్
ఫంక్షన్‌హాల్స్‌కు గిరాకీ బాగుంది..
నాకు పెద్ద ఫంక్షన్ హాల్‌తోపాటు, మినీ ఫంక్షన్ హాల్ ఉంది. డిసెంబర్లో పెండ్లిళ్ల సందర్భంగా బుకింగ్ కోసం విపరీతమైన ఫోన్స్ వస్తున్నాయి. ఇప్పటికే మూడోవంతు బుకింగ్ పూర్తయ్యింది. ఈ నెలా ఖరు నాటికి అన్ని తేదీలలో ఫంక్షన్‌హాల్స్ బుక్ కానున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి గిరాకీ పెరిగింది.
– కొలన్ తిరుపతిరెడ్డి, కేటీఆర్ ఫంక్షన్‌హాల్స్ యజమాని, బడంగ్పేట్