Job mela | ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 27: ఓయూలోని యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో (మోడల్ కెరియర్ సెంటర్)లో 29న మహిళలకు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్ టి.రాము ఒక ప్రకటనలో తెలిపారు. రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కనీసం డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులని, 29 నుంచి 45 ఏండ్లున్న మహిళలు ఎవరైనా మేళాకు హాజరుకావొచ్చని వివరించారు. అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లతో మేళాకు హాజరుకావాలని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని డిగ్రీ కోర్సుల బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును వచ్చే నెల 2వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. రూ.500 అపరాధ రుసుముతో 6వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు.
ఓయూ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేశారు. బీబీఏ, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ, బీకామ్, బీబీఏ, బీఏ తదితర కోర్సుల రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని డిగ్రీ కోర్సుల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలను www.osmania. ac.in లో చూసుకోవాలని కోరారు.