Hyderabad | హైదరాబాద్లోని చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సొంత తమ్ముడినే ఓ అన్న హత్య చేశాడు.
వివరాల్లోకి వెళ్తే అజంపురలోని ముస్లిం మెటర్నిటీ వెనుక భాగంలో నివాసం ఉండే హాసిం హుస్సేన్, షాఫ్దాన్ హుస్సేన్ అన్నదమ్ములు. వారి మధ్య కొంతకాలంగా విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున 6.40 గంటల ప్రాంతంలో తమ్ముడు షాఫ్దాన్ను అన్న హాసిం హత్య చేశాడు.
హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడు హాసిం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.