సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): చోరీ చేసిన వాహనాల చలామణికి అడ్డుకట్ట వేయడంతో పాటు, పాత వాహనాల కొనుగోలుదారులను మోసాల నుంచి రక్షించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ కవచ్‌లో భాగంగా సెకండ్ హ్యాండ్ వాహన డీలర్లు కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా క్రయవిక్రయాలు చేపడుతున్నట్లు నిర్ధారణ కావడంతో పోలీసు శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సోమవారం కీలక మార్గదర్శకాలతో కూడిన అడ్వైజరీని జారీ చేశారు. సెకండ్‌హ్యాండ్ వాహనాల క్రయవిక్రయాలపై ఉన్న నిబంధనలను అడ్వైజరీలో పేర్కొంటూ యజమాని వివరాల ధృవీకరణ లేకుండా వాహనాలను కొనుగోలు చేసినా, తక్కువ కిలోమీటర్లు తిరిగినట్లు చూపించేందుకు ఒడోమీటర్లను ట్యాంపరింగ్ చేసినా చట్టప్రకారం కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
సెకండ్‌హ్యాండ్ వాహనాలు కొనుగోళ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. డీలర్లు ఏదైనా పాతవాహనాన్ని కొనుగోలు చేసే ముందు విక్రయదారుడి గుర్తింపును పక్కాగా ధృవీకరించుకోవాలని, ఒకవేళ అసలు యజమాని కాకుండా వేరొక ప్రతినిధి ద్వారా విక్రయం జరుగుతున్నట్లయితే చట్టబద్ధమైన పవర్ఆఫ్అటార్నీ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. వాహనం కొనుగోలు చేసేముందు అది దొంగిలించబడిందా, బ్లాక్ లిస్టులో ఉందా లేదా ఏదైనా ప్రమాదానికి గురైం దా అన్న విషయాన్ని వాహన్ పోర్టల్ ద్వారా నిర్ధారించుకోవాలని సజ్జనార్ సూచించారు. డీలర్లు వాహనాన్ని తమ వద్దకు తీసుకున్నప్పుడు, వేరొకరికి డెలివరీ చేసే సమయంలో ఓడోమీటర్ రీడింగ్‌ను నమో దు చేయడంతో పాటు ఇంజన్, ఛాసిస్ నంబర్లు ఫో టో తీసి భద్రపరచాలని తెలిపారు.
ఒకవేళ ఏ వాహనానికైనా ఈ గుర్తింపు నంబర్లు ట్యాంపరింగ్‌కు గురై నా లేదా అసలు లేకపోయినా ఆ వాహనాన్ని దొంగిలించిందిగా భావించి పోలీసులు తక్షణమే సీజ్ చేయడమే కాకుండా సదరు వాహనాన్ని తమ వద్ద ఉంచుకున్న రీసెల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాలో వాహనాలకు సంబంధించి తప్పుడు ఫొటోలు, అవాస్తవ సమాచారంతో ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను ఆకర్షించడం నేరమని సీపీ స్పష్టం చేశారు. ఈ నియ మ నిబంధనలను ఉల్లంఘించే డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు వారిపై బీఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేస్తామని , నగరం లో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా తనిఖీలు చేస్తామని.. ఖచ్చితంగా అందరూ సహకరించాలని సీపీ సజ్జనార్ కోరారు.