మెరుగైన మౌలిక వసతులు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, ప్రభుత్వ సంస్థపై నమ్మకంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టుల వైపు మొగ్గుచూపిన ప్రజలకు, భూములిచ్చిన రైతులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. సొంతింటి కల నెరవేరుతుందని లక్షలాది రూపాయలు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేసిన కొనుగోలుదారులు ఒకవైపు.. ప్రభుత్వ అభివృద్ధి పనులకు సహకరించి భూములిచ్చి ఏళ్లుగా పరిహారం ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్న రైతులు మరోవైపు తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నారు.
(నమస్తే తెలంగాణ) : అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా హెచ్ఎండీఏ లేఅవుట్లపై ప్రజల్లో ఉన్న నమ్మకం క్రమంగా సన్నగిల్లుతోంది. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి సకల సౌకర్యాలు ఉంటాయని నమ్మి ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి హెచ్ఎండీఏ చేతిలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. అందుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని హెచ్ఎండీఏ లేఅవుటే స్పష్టమైన ఉదాహరణ. ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసి నాలుగేళ్లు గడుస్తున్నా కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. లేఅవుట్లో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా కల్పించకపోవడంతో కొనుగోలుదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారు. తాగునీటి కోసం చేపట్టిన ఓవర్‌హెడ్ ట్యాంకు, సంపుల నిర్మాణాలు ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్నాయి. సీపీఆర్ఐపర్వతాపూర్ మధ్య 60 అడుగుల అప్రోచ్ రోడ్డు సమస్యను ఇప్పటికీ పరిష్కరించలేదు. పార్కులకు కాంపౌండ్ వాల్స్, గేట్లు ఏర్పాటు చేయడం, గ్రీనరీ అభివృద్ధి చేయడం వంటి పనులను పూర్తిగా గాలికొదిలేశారు. బాధితులు కుటుంబాలతో సహా హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టే పరిస్థితి దాపరించింది.
మరోవైపు ల్యాండ్ పూలింగ్ కింద నమ్మి భూములిచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం ప్లాట్ల పొజిషన్ ఇవ్వడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఆరుట్ల, ఇంద్రకరణ్, ఫసల్వాది, కంది తదితర ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకుని రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ప్లాట్లను మాత్రం స్వాధీనం చేయలేదు. ఆరుట్లలో 106 ఎకరాలకు పైగా లేఅవుట్ ప్రక్రియ పూర్తయినా లబ్ధిదారుల జాబితా లభించలేదనే నెపంతో కేటాయింపులు నిలిపివేశారు. ఫసల్వాదిలో ఇప్పటికీ 60 శాతం మేరకే భూసేకరణ జరిపి, వివాదాల కారనంగా పెండింగ్‌లో ఉన్నాయి. కందిలో 46 ఎకరాలు అందుబాటులో ఉన్నా సాంకేతిక కారణాలతో ఆలస్యం చేస్తున్నారు.
భూములు కోల్పోయి, జీవిత చరమాంకంలో ఆశగా ఎదురుచూస్తున్న రైతులు, కష్టపడి సంపాదించిన డబ్బులతో ప్లాట్లు కొని అప్పులపాలవుతున్న సగటు పౌరులు ఇప్పుడు అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం, హెచ్ఎండీఏ అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా హెచ్ఎండీఏ తన పనీటీరును మార్చుకుని, బాధితులకు న్యాయం చేయాలి.