సిటీబ్యూరో, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): మహా నగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు చెంత మరో అత్యాధునిక సౌకర్యం అందుబాటులోకి రానుంది. దేశంలోనే మొట్ట మొదటి సారిగా సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఐటీ కారిడార్‌లోని నానక్‌రాంగూడ నుంచి, ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ నుంచి రెండు వైపులా మొత్తం 23 కి.మీ మేర సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణం పనులు పూర్తి చేస్తోంది. ఈ పనులను రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ ఆర్వింద్ కుమార్, ఓఆర్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డితో కలిసి శుక్రవారం స్వయంగా పరిశీలించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయని, సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సైకిల్ ట్రాక్‌ను అందుబాటులోకి తీసువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆర్వింద్ కుమార్ తెలిపారు. నగర వాసులకు అత్యాధునికంగా, సౌకర్యంగా ప్రభుత్వం ఔటర్ రింగు రోడ్డు వెంబడి 23 కి.మీ మేర రెండు మార్గాల్లో నిర్మాణం పనులు జరుగుతున్నాయని తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్ రూఫ్ టాఫ్ సైకిల్ ట్రాక్‌ను నిర్మిస్తున్నామని, ఎన్నో ఆకట్టుకునే సదుపాయాలతో నిర్మాణం జరుగుతున్నదన్నారు. సైక్లింగ్ అంటే ఇష్టపడే వారికే కాకుండా వాక్ టు వర్క్స్ కాన్సెప్ట్‌తో ఇంటి నుంచి సైకిల్‌పైనే పనిచేసే కార్యాలయానికి వెళ్లేలా ఈ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపా రు. రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించి, నగర వాసులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారని తెలిపారు. సైకిల్‌పై ప్రయాణం చేసే సమయంలో రోడ్డు మీద ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేలా రెండు మార్గాల్లో 23 కి.మీ మేర సైకిల్ ట్రాక్‌ను రకరకాల మౌలిక వసతులతో నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలో సైకిలిస్టులు ఈ ట్రాక్‌పై పరుగులు పెట్టేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, అన్ని రకాల మౌలిక వసతులను కల్పించి సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. సైకిల్ ట్రాక్ మార్గంలో ప్రతి కి.మీ దూరాన్ని సూచించేలా గుర్తులను ఏ ర్పాటు చేస్తామని, మధ్య లో విశ్రాంతి తీసుకునేందుకు మీటింగ్ పాయింట్లు ఉంటాయని, ట్రాక్ కలరింగ్, భద్రతా పరమైన చిహ్నాలు, విద్యుద్దీపాలు, ఇతర భద్రతా పరమైన ఏర్పాట్లు ఉంటాయని, ప్రధానంగా సైకిల్ ట్రాక్‌పైకి ఇతర వాహనాలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, దీని వల్ల ఎలాంటి ప్రమాదాలకు చోటు ఉండదన్నారు. ముఖ్యంగా రాత్రి వేళ్లల్లోనూ సైక్లింగ్ చేసేందుకు వీలుగా విద్యుత్ దీపాలతో వెలుతురు ఉండేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు.
13 మెగా వాట్ల సొలార్ విద్యుత్ ఉత్పత్తి…
నిత్యం ఎంతో పచ్చదనంతో ఉండే ఓఆర్ఆర్ చెంత 23 కి.మీ మేర నిర్మిస్తున్న సొలార్ రూఫ్ టాఫ్ సైకిల్ ట్రాక్ ప్రాజెక్టులో భాగంగా 13 మెగా వాట్ల సొలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా దీనిని హెచ్ఎండీఏ అధికారులు డిజైన్ చేశారు. ఐటీ కారిడార్‌లో అత్యంత కీలకమైన ప్రాంతంగా ఉన్న “నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ నుంచి నార్సింగి వరకు, అక్కడి నుంచి మంచిరేవుల మీదుగా తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, తిరిగి నార్సింగి నుంచి కోకాపేట మీదుగా కొల్లూరు వరకు” మొత్తం 23 కి.మీ మేర సొలార్ రూఫ్ టాఫ్ను నిర్మిస్తున్నారు. దీంతో సుమారు 13 మెగా వాట్ల సొలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతున్నదని అధికారులు తెలిపారు. ఒకే ప్రాజెక్టుపై ఈ స్థాయిలో సొలార్ విద్యుత్ ఉత్పత్తి కావడంతో పాటు అత్యంత ఉపయోగకరమైన సైక్లింగ్ సదుపాయం నగర వాసులకు అందుబాటులోకి రానుంది. దీంతో రెండు రకాల ప్రయోజనాలు ఈ సోలార్ రూఫ్ టాఫ్ సైకిల్ ట్రాక్‌తో కలుగుతాయని, మున్ముందు ఇదే విధమైన సదుపాయాన్ని మిగతా ప్రాంతాల్లో కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.