కల్తీరాయుళ్లపై కొరడాకు సిద్ధం

హైదరాబాద్ : పరిశుభ్రత పాటించకుండా, ఇబ్బడి ముబ్బడిగా కల్తీ సామగ్రిని వినియోగిస్తూ, వినియోగదారులకు ఆరోగ్యాలతో ఆటలాడుకుంటూ రెండు మూడు రోజుల కిందటి ఆహార పదార్థాలను అందిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలకిది పిడుగు పాటు వార్త. నాణ్యతా ప్రమాణాలను పాటించని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఇక బహుపరాక్..!! ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతామంటే ఇక కుదరదు. కల్తీ ఫుడ్ అందించే నిర్వాహకులు ఇక దుక్నం బంద్ చేసుకోవాల్సిందే! పరిశుభ్రమైన వాతావరణంలో చక్కని భోజనం అందించని హోటళ్లు, రెస్టారెంట్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఉక్కుపాదం మోపాలని జీహెచ్ఎంసీ సంకల్పించింది. ప్రస్తుతం ఉన్న ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లతో పాటు జీహెచ్ఎంసీలో కొత్తగా 26 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లను రంగంలోకి దింపింది. 30 సర్కిళ్లకు గానూ సర్కిల్‌కు ఒక్కొక్కరిని నియమించి నాణ్యమైన భోజనం అందించని, పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై విస్తృత స్థాయిలో తనిఖీలు జరిపి వాటికి జరిమానాలు, సీజ్ లాంటి చర్యలు చేపట్టనున్నారు.
గ్రేటర్ పరిధిలో వేలాదిగా హోటళ్లు
కోటికి పైగా జనాభా కలిగిన గ్రేటర్లో దాదాపు 12 నుంచి 14 వేల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయిల్ నుంచి మొదలు, ఉప్పు దాకా నాణ్యమైన వాటిని వినియోగించి నిర్వాహకులు క్వాలిటీ ఫుడ్‌ను అందించాలి. జీహెచ్ఎంసీ స్టాంప్ వేసిన మాంసాన్నే వాడాలి. కాని, నియమ నిబంధనలను పక్కన పెట్టేసి ధనార్జనే ధ్యేయంగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు వ్యాపారాన్ని సాగిస్తున్నారు.
వంట గదుల్లో శుభ్రత ఎక్కడా?
వంట గదులు పరిశుభ్రత పాటించడం లేదు. ఫుడ్ తయారీలో అణువణువునా కల్తీ వస్తువులనే ప్రోత్సహిస్తున్నారు. పైగా పాచిపోయిన ఆహారాన్ని ఫ్రీజర్స్‌లో పెట్టి తిరిగి వేడి చేసి పెడుతున్నారు. మాంసమైతే రోజుల తరబడి ఫ్రిజ్‌లో పెట్టి దానికి మసాలాలు దట్టించి మరుసటి రోజు వాడుతున్నారు. బిర్యానీలో బొద్దింకలు, వెంట్రుకలు వస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఈ జాబితాలో చిన్న హోటళ్లు నుంచి బడా హోటళ్ల నిర్వాహకులు వేలాదిగా ఉంటున్నారు. తరచు జీహెచ్ఎంసీకి నిత్యం 10 వరకు పైగా ఫిర్యాదులు ఇలాంటివే ఎక్కువగా వస్తున్నాయి. మెరుగైన పౌర సేవలు, ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దరిమిలా కల్తీరాయుళ్ల భరతం పట్టాలని నిర్ణయించింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా జీహెచ్ఎంసీలోకి భారీగా ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియామకానికి అనుమతి ఇచ్చింది. టీఎస్పీఎస్సీ నుంచి 26 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు భర్తీ కాగా, శిక్షణ పూర్తి చేసుకున్న 20 మంది జీహెచ్ఎంసీలో రిపోర్టు చేశారు. మరో ఆరుగురు వచ్చే నెలలో రానున్నారు. సర్కిల్‌కు ఒకరు చొప్పున ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియమించి నాణ్యత పాటించని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు తొలుత జరిమానాలు, ఆ తర్వాత సంబంధిత వాటిని సీజ్ చేయడంపై దృష్టి సారిస్తున్నారు. కల్తీ ఉన్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
- సిలికాన్ వ్యాలీని వీడుతున్న బడా కంపెనీలు.. ఎందుకంటే..?
- ‘సుందిళ్ల బ్యారేజీలో తనిఖీలు’
- ఆకాశ్-కేతిక ‘రొమాంటిక్’ లుక్ అదిరింది
- ట్రాఫిక్ జరిమానా కోసం మంగళసూత్రం తీసిచ్చిన మహిళ
- ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన రోహిత్, అశ్విన్
- మార్చి లేదా ఏప్రిల్‌లో పెట్రోల్ ధరలు తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
- బ్రెజిల్ ప్రధానికి ప్రధాని మోదీ అభినందనలు
- మల్లయోధుల బృందాన్ని సత్కరించిన పవన్ కళ్యాణ్
- ముంచుకొస్తున్న అంటార్కిటికా ముప్పు.. మంచు కొండలో పగుళ్లు.. వీడియో
- కాస్త స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు!