శరీరంలోని అతిపెద్ద అవయవం.. కాలేయం. అతిపెద్ద గ్రంథిగానూ పరిగణిస్తారు. దాదాపు 500రకాలకు పైగా జీవక్రియలను నిర్వర్తిస్తూ, జీవప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. పునరుత్పత్తి శక్తి కలిగిన ఏకైక అవయవం కూడా కాలేయమే. దీనిని వైద్యపరిభాషలో ‘హెపటో’ లేదా ‘హెపాటిక్’ అనే గ్రీకు పదాలతో పిలుస్తారు. ఇది 1.5కిలలో వరకు బరువు ఉంటుంది.
హెపటైటిస్ :
విషతుల్యమైన పదార్థాలు, కలుషిత ఆహారం, నీరు, మద్యం, ధూమపానం ప్రభావంతో కాలేయం వాపునకు గురవుతుంది. ఇలా కాలేయం వాపునకు గురవడాన్నే ‘హెపటైటిస్’ అంటారు. ఎ, బి, సి, డి, ఇ అనే ఐదు రకాల వైరస్లు.. కాలేయాన్ని హెపటైటిస్‌కు గురిచేస్తాయి.
ప్రమాదకరం.. బి, సి వైరస్లు :
హెపటైటిస్‌కు గురిచేసే ఐదు వైరస్లలో బి, సి వైరస్లు చాలా ప్రమాదకరమైనవి. రక్త మార్పిడి వలన, అసురక్షిత శృంగారం ద్వారా తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు ఈ వైరస్లు సోకే ప్రమాదం ఉంటుంది. హెపటైటిస్-బి సోకకుండా మూడు డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కానీ, హెపటైటిస్-బి పాజిటివ్ ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. పరీక్షలు చేయించుకుని నెగిటివ్ ఉంటే, ఏ వయసులోనైనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. పిల్లలకు వారి టీకా షెడ్యూల్ ప్రకారం ఈ వ్యాక్సిన్ వేయించడం ఉత్తమం. ఇక హెపటైటిస్-సికి ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.
ఈ లక్షణాలుంటే జాగ్రత్త :
ఆకలి మందగించడం, వికారం, కామెర్లు, జ్వరం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. నాటువైద్యం జోలికి వెళ్తే మొదటికే మోసం. లివర్ ఇన్ఫెక్షన్, ఫ్యాటీ లివర్, లివర్ అబ్సెస్, విల్సన్ డిసీజ్, గిల్బర్ట్ సిండ్రోమ్ వంటి అనేక రకాల కాలేయ సంబంధిత వ్యాధులున్నా.. వీటిలో హెపటైటిస్-బి, సి వైరస్లు కలగచేసే ఇన్ఫెక్షన్లు కొన్ని సంవత్సరాల తరువాత కాలేయాన్ని ప్రభావితం చేస్తాయి. కాలేయాన్ని గట్టిగా మార్చడం(సిరోసిస్) తరువాత కాలేయ క్యాన్సర్‌కు దారి తీయవచ్చు.
ప్రమాదకరం.. కాలేయ క్యాన్సర్ :
ఆలస్యంగా బయటపడే కాలేయ క్యాన్సర్లు చాలా ప్రమాదకరమైనవి. వీటిని రెండు రకాలుగా పరిగణిస్తారు. ఒకటి హెపటుసెట్యూలార్ కార్సినోమా. ఇది కాలేయంలో నుంచి వస్తుంది. రెండోది మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్. శరీరంలోని ఇతర భాగాలలో మొదలై.. కాలేయానికి వ్యాపిస్తుంది. జీర్ణవ్యవస్థలోని చాలారకాల క్యాన్సర్లు కాలేయానికి వ్యాపిస్తాయి. వీటితోపాటు
బ్రెస్ట్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్లుకూడా కాలేయానికి వ్యాపిస్తాయి.
ప్రధాన కారణం.. హెపటైటిస్-బి :
భారత్, చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్, కొరియా, సౌత్ ఆఫ్రికాలలో హెపటైటిస్-బి, ఇన్ఫెక్షన్ల వల్లే కాలేయ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. పుట్టుకతో ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ 30 లేదా 40 సంవత్సరాలలో లక్షణాలు బయట పడటం, క్యాన్సర్‌కు గురవడం చూస్తున్నాం.
పురుషులలో అధికం :
కాలేయ క్యాన్సర్ మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రోగం త్వరగా ముదిరి, చికిత్సకు లొంగదు.
ముదిరిన దశలోని లక్షణాలు :
కడుపులో నొప్పి
వాంతులు
వికారం
ఆకలి మందగించడం
ఈ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు :
హెపటైటిస్-బి లేదా హెపటైటిస్-సి ఉన్నవారు రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్యను, షుగర్ స్థాయిలు, క్యాల్షియం, కొలెస్ట్రాల్ స్థాయిలు, ఆల్ఫాఫీటా ప్రొటీన్(ఏఎఫ్‌పీ) తదితర వివరాలు తెలిపే రక్తపరీక్షలతోపాటు అల్ట్రాసౌండ్ పరీక్షలు, వైద్యుల సలహా మేరకు సీటీ, ఎంఆర్ఐ, పెట్-స్కాన్, లివర్ బయాప్సీ తదితర పరీక్షలతో కాలేయ క్యాన్సర్ ఏ దశలో ఉన్నదో తెలుసుకోవచ్చు.
చికిత్సా పద్ధతులు :
కాలేయంలో కణితి పరిమాణం, ఏర్పడిన ప్రదేశం ఆధారంగా చికిత్స ఇస్తారు. ఈ క్యాన్సర్ పెరిగే విధానం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో నెలలోపే కణితి రెట్టింపు అయితే, మరికొందరిలో సంవత్సరానికి పైగా పట్టొచ్చు. కణితి చిన్నగా ఉన్నప్పుడే గుర్తించినా.. అది లివర్ సిరోసిస్‌కు గురవడం వల్ల సర్జరీ చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు కీమోథెరపీ, ట్రాన్స్ ఆర్టిరియల్ కీమో ఎంబో లైజేషన్, రేడియో అబ్లేషన్, ప్రోటాన్ భీమ్ థెరపీ, బయోథెరపీ, కీమో అబ్లేషన్, స్టీరియో టాక్టర్ రేడియో సర్జరీ వంటి పద్ధతులతో కణితిని తొలగించడం లేదా పరిమాణాన్ని తగ్గించవచ్చు. కణితి చిన్న సైజులో ఉండి, కాలేయ ఇతర భాగం బాగానే ఉంటే శస్త్రచికిత్సనే ఉత్తమం. కణితి పెద్దగా ఉన్నా లేక ఎక్కువ సంఖ్యలో కణుతులు ఉన్నా, కాలేయం విఫలమయ్యే దశలో ఉన్నా.. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98490 22121