న్యూఢిల్లీ : స్ధూలకాయం, కొవ్వు పేరుకుపోతుందనే భయంతో చాలామంది కార్బోహైడ్రేట్లను తీసుకునేందుకు వెనుకాడతుంటారు. అయితే కార్బోహైడ్రేట్లను తగినంత తీసుకుంటే దీర్ఘాయువు సొంతమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అత్యధిక జీవనప్రమాణం కలిగిన వారుండే బ్లూజోన్ డైట్లోనూ కార్బోహైడ్రేట్లకు ప్రత్యేక స్దానం ఉంది. సార్ధినియా, ఒకినావా, ఇకరియా, నికోయ వంటి బ్లూజోన్ ప్రాంతంలో ప్రజలు తీసుకునే ఆహారంతోనే అక్కడి వారు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవిస్తున్నారని పరిశోధనలు వెల్లడించాయి.
బ్లూజోన్ ప్రజల ఆహారంలో 65 శాతం కార్బోహైడ్రేట్లు ఉండటం విశేషం. ముఖ్యంగా నాలుగు రకాల బ్రెడ్లు బ్లూజోన్ ప్రజల ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఏతో కూడిన కార్న్‌బ్రెడ్ ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. బార్లీ నుంచి తయారుచేసిన హోల్ గ్రెయిన్ బ్రెడ్‌ను బ్లూజోన్ ప్రజలు ఇష్టంగా తింటారు.
ఇందులో ఫైబర్, ప్లాంట్ ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి దీర్ఘాయువును అందిస్తాయి. ట్రిప్టోపాన్ వంటి ఆమినో యాసిడ్లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక పులియబెట్టిన పిండితో చేసిన బ్రెడ్ బ్లూజోన్ డైట్లో ముందువరుసలో ఉంటుంది. పులియబెట్టిన ఆహారం కావడంతో ఇందులో ఇమ్యూనిటీని, ప్రేవుల ఆరోగ్యాన్ని పెంచే ప్రిబయాటిక్స్ మెండుగా ఉంటాయి. ఇక ఆరోగ్యకర కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్‌తో నిండిన పిటా బ్రెడ్ కూడా బ్లూజోన్ డైట్లో భాగం.