నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తూ, సమాజ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సైకాలజిస్టులు తోడ్పడుతున్నారు. ఆధునిక, వేగవంతమైన ప్రపంచంలో చాలామంది ఉద్యోగం, చదువు, కుటుంబ సమస్యల వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనకు గురవుతున్నారు. సైకాలజిస్టులు వీరి సమస్యలకు థెరపీ ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. పరీక్షల భయం, మార్కుల ఒత్తిడి, కెరీర్ ఎంపికలో గందరగోళం లాంటి విషయాల్లో విద్యార్థులకు చైల్డ్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజిస్టులు సహాయపడుతున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కుటుంబంలో వివాదాలు, జనరేషన్ గ్యాప్ వంటి సమస్యలను పరిష్కరించడంలో సైకాలజిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మద్యం, డ్రగ్స్, నేటి తరాన్ని వేధిస్తున్న స్క్రీన్/గేమింగ్ అడిక్షన్ నుంచి బయటపడటానికి సైకాలజిస్టుల బిహేవియరల్ థెరపీ ఎంతో అవసరం.
నేటికీ సమాజంలో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే పిచ్చి అనుకుంటారనే ఒక అపోహ ఉంది. ఇది తప్పు. శారీరక ఫిట్నెస్ కోసం జిమ్‌కి వెళ్లినట్లే, మానసిక ఫిట్‌నెస్‌కు సైకాలజిస్ట్‌ను కలవడం అనేది సాధారణమైన విషయం. మనసు విప్పి మాట్లాడలేని విషయాలను, జడ్జ్ చేయకుండా విని, సరైన దిశగా ఆలోచించేలా చేసేవారే సైకాలజిస్టులు. సున్నితమైన మనసుకు అంతే జాగ్రత్తగా చికిత్సచేస్తూ, సమాజంలో సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను నింపడానికి నిరంతరం శ్రమిస్తున్న సైకాలజిస్టులందరికీ ‘సైకాలజిస్ట్ ప్రశంసా దినోత్సవం’ శుభాకాంక్షలు.
మనసుకూ చికిత్స అవసరమని ఇప్పుడిప్పుడే గుర్తించడం ప్రారంభిస్తున్న సమాజానికి మేమున్నామని భరోసా ఇస్తున్నారు సైకాలజిస్టులు. శరీరానికి చికిత్స సులభం. కానీ కనపడని మనసుకు చికిత్స చేయడం అంత తేలిక కాదు. అక్కడే సైకాలజిస్టుల పాత్ర మొదలవుతుంది. ఏటా జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా సైకాలజిస్ట్ ప్రశంసా దినోత్సవం నిర్వహిస్తున్నారు. సమాజానికి వారు అందిస్తున్న అమూల్యమైన సేవలను గుర్తించడానికి, వారికి కృతజ్ఞతలు తెలపడానికి ఈ రోజు ఒక మంచి అవకాశం.