World Liver Day | లివర్ సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ “వరల్డ్ లివర్ డే” గా జరుపుకుంటున్నాం. ఈ మేరకు లివర్ వ్యాధుల తీవ్రత గురించి అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో “లివర్ క్యాన్సర్ పరిణామాలు.. చికిత్సా విధానాలు.. అధునాతన వైద్యం” గురించి తెలుసుకుందాం అని చెబుతున్న రెనోవా – ఎన్ ఐ జి యల్ హాస్పిటల్స్ కు చెందిన డైరక్టర్ & సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అండ్ లివర్ ట్రాన్సుప్లాంట్ సర్జన్ డాక్టర్. ఆర్.వి. రాఘవేంద్ర రావు గారు వివరించారు. అవేంటో ఆయన మాటల్లోనే..
1. లివర్ సర్జరీ (హెపటెక్టమీ):
ఈ అత్యున్నత సున్నితమైన శస్త్ర చికిత్స (హెపటెక్టమీ) ద్వారా క్యాన్సర్ సోకిన లివర్ భాగాన్ని తొలగించడం జరుగుతుంది. క్యాన్సర్‌ను పూర్తిగా నిర్మూలించడంలో ఈ హెపటెక్టమీ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత కాలంలో ఈ ఆపరేషన్‌ను లాపరోస్కోపి, రొబోటిక్ అసిస్టెడ్ విధానాల ద్వారా చేయడానికి వీలవుతుంది. తద్వారా ఆపరేషన్ మెరుగ్గా చేయగలగడమే కాకుండా తొందరగా రోగి రికవరీ అవ్వడానికి కూడా ఈ విధానాలు దోహదపడుతాయి.
2. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్:
లివర్ క్యాన్సర్ బాగా ముదిరిన దశలో ఉన్నప్పుడు లేదా క్యాన్సర్‌తో పాటుగా లివర్ సిర్రోసిస్ బాగా ముదిరిన దశలో ఉన్నప్పుడు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. ఈ పద్ధతిలో చెడిపోయిన కాలేయాన్ని పూర్తిగా తొలగించి కొత్త కాలేయాన్ని అమర్చడం జరుగుతుంది. ఇందుకు ఆరోగ్యవంతమైన కాలేయాన్ని బ్రెయిన్ డెడ్ (కాడెవర్ లివర్ – డీడీఎల్టీ) అయిన వ్యక్తి నుంచి లేదా కుటుంబ సభ్యుల నుంచి (లివింగ్ డోనార్ – ఎల్ డి ఎల్ టి) ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ విధానంలో అనేక సాధక బాధకాల్ని అధిగమించవలసిన అవసరం ఉంటుంది.
3. కీహోల్ ఆపరేషన్స్:
కొన్ని సందర్భాలలో ఈ క్లిష్టమైన హెపటెక్టమీ ఆపరేషన్స్‌ను తేలికపాటి లాపరోస్కోపి, రొబోటిక్ విధానాల ద్వారా చేయడానికి వీలవుతుంది. తద్వారా రోగి రికవరీని సుగమం చేయడమే కాకుండా ఆపరేషన్ చేసిన ప్రాంతంలో గాటు గాని మచ్చ గాని లేకుండా ఆపరేషన్ పూర్తి చేయడానికి వీలవుతుంది.
4. క్యాన్సర్ మందుల వాడకం:
ఆధునిక రీసెర్చ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన పరిజ్ఞానంతో లివర్ క్యాన్సర్‌ను కొన్ని మందుల వాడకం ద్వారా నిర్జీవం చేయడానికి వీలవుతుంది. ఇందులో ప్రముఖంగా టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీల ద్వారా శరీరం రోగ నిరోధక శక్తిని వినియోగించుకుంటూ లివర్ క్యాన్సర్ తీవ్రతను, వ్యాప్తిని అరికట్టడానికి అలాగే క్యాన్సర్ దశని తగ్గించడానికి వీలవుతుంది.
5. టీం వర్క్:
లివర్ క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన రోగాల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో అన్ని రంగాలు కలిసి పనిచేయడం చాలా ముఖ్యం. ఇందులో ప్రతి రోగిని ఆంకాలజిస్టు, హెపాటాలజిస్ట్, సర్జన్ అలాగే ఇతర రంగాల నిపుణులు పరిశీలించి విశ్లేషణ చేయడం ద్వారా రోగి పరిస్థితి, క్యాన్సర్ తీవ్రత, క్యాన్సర్ దశ లాంటి అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటూ మల్టీ డిసిప్లినరీ విధానాల ద్వారా క్యాన్సర్‌పై పై చేయి పొందడానికి వీలవుతుంది.
6. సవాలు:
ఇంత ఆధునిక పురోగతి జరిగినప్పటికీ కూడా లివర్ క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించడం అనేది ఇంకా ఒక్క సవాలుగానే ఉన్నది. అదే విధంగా క్యాన్సర్‌ను కలుగజేసే హెపటైటిస్ B, హెపటైటిస్ C వైరస్ ల నియంత్రణ కూడా ఇంకా పూర్తిస్థాయిలో జరగాల్సి ఉన్నది. అయితే నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తూ ఆధునిక శస్త్ర చికిత్సలు అవలంబిస్తూ సమాజంలో లివర్ క్యాన్సర్ పైన దానికి అందుబాటులో ఉన్నటువంటి చికిత్స విధానాల పైన అవగాహన కల్పిస్తూ మరింత పురోగతి పొందడానికి అవకాశం ఉంది.
7. జాగ్రత్తలు:
అనేక రకాల లివర్ సమస్యలను క్రమబద్దమైన జీవన సరళి, చక్కటి ఆహారపు అలవాట్లతో నివారించవచ్చు. మద్యపానానికి దూరంగా ఉండటం, హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా లివర్ వ్యాధులను నివారించుకోవచ్చు.