PCOS | నేటి కాలంలో చాలా మంది మహిళలను వేధిస్తున్న అనారోగ్య సమస్యలల్లో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ఒకటి. చిన్న చిన్న లక్షణాలతోనే ఇది మొదలవుతుంది. నెలసరి క్రమంగా లేకపోవడం, అకస్మాత్తుగా బరువు మార్పులు, తగ్గని మొటిమలు వంటి వాటిని పీసీవోఎస్ సంకేతాలుగా చెప్పవచ్చు. యుక్త వయస్సులో ఉన్న మహిళలను ఎక్కువగా ప్రభావితం చేసే ఈ హార్మోన్ల సమస్య కేవలం శారీరక లక్షణాలకే పరిమితం కాదు. మూడ్, శక్తి స్థాయిలు, దీర్ఘకాలిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. దీంతో రోజువారీ జీవితం అనిశ్చితంగా అనిపిస్తుంది. సాధారణంగా PCOS అనేది అసమాన నెలసరి, అధిక ఆండ్రోజెన్ (పురుష హార్మోన్) స్థాయిలు, అలాగే అండాశయాల్లో చిన్న ద్రవంతో నిండిన సిస్టులు ఏర్పడటం వంటి లక్షణాలతో నిర్దారణ అవుతుంది. ఇది వంధ్యత్వానికి ప్రధాన కారణాలలో ఒకటిగా భావించినప్పటికీ, జీవనశైలి మార్పులు, సరైన ఆహారపు అలవాట్లతో నియంత్రించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
PCOS ఒకే సమస్య కాదని, ఇది హార్మోన్ల, మెటబాలిక్ అసమతుల్యతల సమ్మేళనమని, సరైన ఆహారం ప్రతి లక్షణాన్ని సమర్థంగా నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని పదార్థాలు PCOS నియంత్రణలో సహాయపడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖంపై అనవసర రోమాల కోసం స్పియర్మింట్ టీ ఉపయోగకరం. రోజుకు ఒక కప్పు స్పియర్మింట్ టీ తీసుకోవడం ద్వారా అధిక ఆండ్రోజెన్ స్థాయిలు తగ్గి, ముఖంపై రోమాల పెరుగుదల క్రమంగా తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర నియంత్రణకు దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. రోజుకు అర టీస్పూన్ దాల్చిన చెక్క తీసుకోవడం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. దీంతో బ్లడ్ షుగర్ నియంత్రణ మెరుగై, కొవ్వు నిల్వ తగ్గుతుంది. అదే విధంగా ఉబ్బరం తగ్గించడానికి అల్లం ఉపయోగకరం. రోజుకు ఒకటిన్నర ఇంచుల అల్లం తీసుకోవడం వల్ల గ్యాస్, ఉబ్బరం తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది గట్ మోటిలిటీని (జీర్ణ వ్యవస్థ పనితీరు) కూడా మెరుగుపరుస్తుంది.
ఇక అసమాన అండోత్పత్తి సమస్యకు గుమ్మడి గింజలు సహాయపడతాయి. ఇవి జింక్‌ను సమృద్ధిగా కలిగి ఉండి అండోత్పత్తి, హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇస్తాయి. అలాగే మొటిమల నియంత్రణకు పసుపు ఉపయోగపడుతుంది. రోజుకు అరకప్పు టీస్పూన్ పసుపు తీసుకోవడం వల్ల దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గించి చర్మాన్ని శాంతింపజేస్తాయి. దీర్ఘకాలిక వాపు తగ్గించడానికి బెర్రీలు సహాయపడతాయి. రోజుకు అర కప్పు బెర్రీలు తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న అంతర్గత ఇన్ఫ్లమేషన్ (వాపు) తగ్గుతుంది. PCOS నియంత్రణలో నిరంతర జీవనశైలి మార్పులే కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. తీవ్రమైన డైట్స్ కంటే చిన్న చిన్న మార్పులను క్రమంగా పాటించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.