Hair Transplant | వయసు మీద పడుతుంటే బట్టతల రావడం సహజమైన పరిణామం. కానీ ఈ సమస్య ఇప్పుడు యువతరంలో ఎక్కువగా కనిపిస్తున్నది. జుట్టు రాలిపోవడం అన్నది మన ఆత్మవిశ్వాసం, హుందాతనం మీద ప్రభావం చూపుతుంది. మానసికంగా కుంగదీస్తుంది. అయితే జుట్టు రాలిపోవడం, బట్టతల ఏమంత పెద్ద సమస్యలు కావు. వివిధ పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. సర్జరీ ద్వారా బట్టతలకు వెంట్రుకలు అమర్చే చికిత్స. ఇందులో భాగంగా తల వెనక, గడ్డం, ఛాతీలాంటి భాగాల నుంచి ఆరోగ్యవంతమైన వెంట్రుకల కుదుళ్ల (హెయిర్ ఫాలికిల్స్)ను తీసుకుని, జుట్టు ఊడిపోయిన భాగంలో అమరుస్తారు. అలా రాలిపోయిన వెంట్రుకల స్థానంలో శాశ్వతంగా కొత్త జుట్టు మొలిపిస్తారు. తలమీద మాత్రమే కాదు.. కనుబొమలు, గడ్డం లాంటి భాగాల్లో వెంట్రుకలు అమర్చడానికి కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. జుట్టు విపరీతంగా రాలిపోతుంటే.. తలపైన ఉన్న కుదుళ్ల మొదళ్లను మూసివేయడానికి థెర్మోస్కొపిక్ పరీక్షలు చేస్తారు. అవసరం అనుకుంటే.. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ (పీఆర్పీ)తో సమస్యను కొంతమేర చక్కబెడతారు. ప్రాథమిక దశలో ఇది ఉత్తమం.
బట్టతల దశను బట్టి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. సాధారణంగా 18 ఏండ్లు దాటిన ఎవరైనా ఈ చికిత్స చేయించుకోవచ్చు. కాకపోతే, 25 ఏండ్లు వచ్చేదాకా ఆగితేనే మంచిది. చిన్న వయసులోనే వచ్చే బట్టతల స్థిరంగా ఉండదు. పెద్దయ్యేకొద్దీ విస్తరిస్తూ పోతుంది. సర్జరీకి వెళ్లడానికి ముందు.. మందులు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ (పీఆర్పీ)తో సమస్యను కొంతమేర నివారించుకోవచ్చు. మరోదారి లేకపోతే.. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్లడమే ఉత్తమం. చిన్న వయసులో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే ఓ ఇబ్బంది ఎదురవుతుంది. బట్టతల విస్తరిస్తూ పోతున్నప్పుడు.. సర్జరీ చేయని భాగంలో వెంట్రుకలు రాలిపోకుండా వైద్యుల సలహాతో మందులు వాడాలి. లేకపోతే, అసహ్యంగా కనిపిస్తుంది. ఆ అతుకుల కంటే.. బట్టతలే నయం అనిపిస్తుంది. కాబట్టి, ఆలో చించి తగిన నిర్ణయం తీసుకోవాలి.