Snacks | జంక్ ఫుడ్ అంటే ఇష్టం లేని వారు ఉండరనే చెప్పవచ్చు. జంక్ ఫుడ్ ను ఇష్టపడకుండా ఉండడం కష్టంగానే ఉంటుంది. సమోసా, వడా పావ్, మోమోస్ వంటి రుచికరమైన పదార్థాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే వీటిని తినడం వల్ల శరీరంపై పడే ప్రభావాన్ని అర్థం చేసుకుని సమతుల్యం పాటించడం చాలా ముఖ్యమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పోషకాహార నిపుణుల ప్రకారం, భోజనం తినడం కేవలం కొన్ని నిమిషాల్లో ముగిసిపోతుంది. కానీ ఆ ఆహారం వల్ల వచ్చే కాలరీల ప్రభావం శరీరంలో గంటల తరబడి కొనసాగుతుంది. ముఖ్యంగా దేశంలో చాలా మంది రోజుకు 5వేల అడుగులు కూడా నడవడం లేదు. అయితే స్నాక్స్ తిన్నప్పటికీ తినే ఆహారాలకు అనుగుణంగా శారీరక శ్రమ ఉంటే ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలను అడ్డుకోవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.
అందరూ ఎంతో ఇష్టంగా తినే సమోసా గురించి చెప్పాలంటే, ఒక సమోసాలో సుమారు 262 కాలరీలు ఉంటాయి. వీటిని ఖర్చు చేయాలంటే దాదాపు 6వేల అడుగులు నడవాలి, అంటే సుమారు ఒక గంట సమయం పడుతుంది. అలాగే వడా పావ్లో సుమారు 320 కాలరీలు ఉండగా, వాటిని బర్న్ చేయడానికి సుమారు 70 నిమిషాలు లేదా 7వేల అడుగులు నడవాల్సి ఉంటుంది. మోమోస్ కూడా తేలికగా కనిపించినా, ఒక ప్లేట్లో దాదాపు 360 కాలరీలు ఉంటాయి. వీటిని తగ్గించాలంటే 7,500 అడుగులు లేదా సుమారు 75 నిమిషాల శారీరక శ్రమ అవసరం. పానీ పూరీలో సుమారు 200 కాలరీలు ఉండగా, వీటిని బర్న్ చేయడానికి 40 నిమిషాలు లేదా 4వేల అడుగులు నడవాలి.
అలాగే అలూ బర్గర్లో దాదాపు 450 కాలరీలు ఉంటాయి. వీటిని ఖర్చు చేయాలంటే 1.5 గంటల పాటు శారీరక శ్రమ అవసరం. చోళే భటూరే అయితే ఇంకా ఎక్కువ. సుమారు 600 కాలరీలు ఉండి, వాటిని పూర్తిగా బర్న్ చేయడానికి దాదాపు 2 గంటలు లేదా 12వేల అడుగులు నడవాల్సి ఉంటుంది. ఇక సాధారణ పరిమాణంలో ఉన్న పిజ్జా అయితే, దాని క్యాలరీలను ఖర్చు చేయడానికి రోజులో సగం సమయం వరకు శారీరక శ్రమ అవసరం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఆహారాలను పూర్తిగా మానేయాలని కాదు, కానీ అవి శరీరంపై చూపే ప్రభావాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సమోసా తినాలనిపిస్తే తినండి. కానీ దాన్ని తినడం వల్ల వచ్చే క్యాలరీలను ఎలా కరిగించాలో కూడా ఆలోచించండి.. అని వారు సూచిస్తున్నారు.