e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home ఆరోగ్యం స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ క్యాన్సర్స్‌ ముందు జాగ్రత్తలు

స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ క్యాన్సర్స్‌ ముందు జాగ్రత్తలు

భారతీయ స్త్రీలలో ఎక్కువగా కనిపించే సమస్య గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్‌ క్యాన్సర్‌). దీని బారిన పడకుండా అమ్మాయిలకు హెచ్‌వీపీ వ్యాక్సిన్‌ ఉన్నా, అవగాహన లేకపోవడం వల్ల వేయించుకోకపోవడం ఒక కారణమైతే.. పరిశుభ్రత తక్కువగా ఉండటం, కాన్పులు ఎక్కువ కావటం, చిన్న వయసు నుండే శృంగార జీవితం, గ్రామీణ నేపథ్యం, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెచ్‌వీపీ వైరస్‌ ఎక్కువగా ఉండటం ఇతర కారణాలుగా చెప్పుకోవచ్చు. అందుకే పెళ్లికాని అమ్మాయిలు లేదా పెళ్లి అయినవారైతే ఈ క్యాన్సర్‌ లేదని పరీక్షల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత.. మూడు డోసులు వ్యాక్సిన్‌ వేయించుకుంటే సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుకోగలుగుతాం.

ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్‌ స్త్రీలలోనే ఎక్కువగా ఉన్నా.. వ్యాక్సిన్స్‌ వేయించుకోవడం వల్ల, పాప్‌స్మియర్‌ పరీక్ష చేయించుకొని క్యాన్సర్‌ ప్రమాదాన్ని ముందే పసిగట్టి ట్రీట్‌మెంట్‌ తీసుకోవడం వల్ల ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండవచ్చు. ఒకవేళ గురయినా ట్రీట్‌మెంట్స్‌తో బయటపడేవారి సంఖ్య పెరుగుతూ ఉండటం కూడా కొంతవరకు శుభ పరిణామమే అని చెప్పుకోవచ్చు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ హెచ్‌పీవీ వైరస్‌లో 16 నుంచి 18 రకాలు ఉంటాయి. ఇవేవీ సోకకుండా అనేక వ్యాక్సిన్స్‌ ఉన్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇతర కారణాలవల్ల అరుదుగా ఈ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అందుకనే, డాక్టర్‌ సలహా మేరకు అప్పుడప్పుడూ పాప్‌స్మియర్స్‌ చేయించుకుంటూ ఉంటే, గర్భాశయ ముఖద్వారంలోని కణాల మార్పును ముందే పసిగట్టగలుగుతాము. స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఏఏ క్యాన్సర్లు ఉన్నాయి? వాటి లక్షణాలు ఏమిటి? అన్నది ఒకసారి తెలుసుకుందాం.

- Advertisement -

అండాశయాల (ఒవేరియన్‌) క్యాన్సర్‌ : స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ తర్వాత ఈ క్యాన్సర్‌ అధికమని చెప్పుకోవచ్చు. అండాశయం పొట్ట లోపల ఉండటం వల్ల లక్షణాలు చాలా లేటుగా గుర్తించగలుగుతాం. అందుకే, ఈ క్యాన్సర్‌ను ‘సైలెంట్‌ కిల్లర్‌’గా పేర్కొంటారు. పిల్లలు కలుగని స్త్రీలలో, బ్రెస్ట్‌, కోలన్‌ క్యాన్సర్‌ వచ్చిన వారిలో, దీర్ఘకాలం పాటు హార్మోన్స్‌, కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకునే వారిలో ఈ క్యాన్సర్‌ ప్రమాదం ఎక్కువ. మొదట్లో వచ్చే లక్షణాలను అజీర్తి, యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌గా పొరబడటం వల్ల తొలిదశలో ఈ క్యాన్సర్‌ను గుర్తించలేకపోవచ్చు.
లక్షణాలు :

 1. పొత్తి కడుపు ఉబ్బి, నొప్పిగా ఉండటం.
 2. అజీర్తి, వికారం, తేన్పులు వంటి జీర్ణ సంబంధ సమస్యలు.
 3. యోని స్రావాలు అసాధారణంగా, మూత్రం ఎక్కువగా రావడం.
 4. అలసట, జ్వరం.
  సి.ఎ. 125 రక్త పరీక్ష, అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌లతో ఈ క్యాన్సర్‌ను నిర్ధారించగలుగుతాము.

యుటెరైన్‌ లేదా ఎండోమెట్రియల్‌ లేదా గర్భాశయ క్యాన్సర్‌ :
గర్భసంచిలో లైనింగ్‌ని ఎండోమెట్రియమ్‌ పొర మరీ పలుచగా, లేదా 14 మి.మీ. కంటే ఎక్కువ మందంగా ఉండటం మంచిది కాదు. పిల్లలు కలుగని స్త్రీలలో, శరీరంలో ఈస్ట్రోజెన్‌ లెవల్స్‌ ఎక్కువకాలం పాటు ఉన్నా, రొమ్ము క్యాన్సర్‌ వచ్చిన వారిలో, నెలసర్లు తొమ్మిదేండ్ల కంటే ముందు ప్రారంభం అయిన వారిలో, మోనోపాజ్‌కు చేరుకున్న స్త్రీలలో, అధిక బరువు ఉన్నవారిలో ఈ క్యాన్సర్‌ ప్రమాదం ఉంటుంది. 50 నుండి 64 ఏండ్ల మధ్య వయస్సు స్త్రీలలో ఈ క్యాన్సర్‌ ఎక్కువగా కనిపిస్తోంది. అందుకనే, మోనోపాజ్‌ దశకు చేరుకున్న స్త్రీలకు నెలసర్లు పూర్తిగా ఆగిపోయిన ఒక సంవత్సరం తర్వాత, రక్తస్రావం అప్పుడప్పుడు అయినా, తరచుగా అయినా లేక చాలా కొద్దిగా రక్తం కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. స్త్రీలు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు “ఏంటి? మళ్లీ ఈ వయస్సులో నెలసర్లు మొదలయ్యాయి. ఎవ్వరితో చెప్పుకోను” అని మొహమాట పడుతూ ఉంటారు. కానీ, మొహమాటపడి నిర్లక్ష్యం చేయాల్సిన సందర్భం కానేకాదు అని గుర్తుంచుకోవాలి.

బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు టొమాక్సిఫెన్‌ మందు వాడిన స్త్రీలు, పెల్విస్‌కు రేడియేషన్‌ తీసుకున్నవారు, హార్మోన్‌ థెరపి దీర్ఘకాలంపాటు తీసుకున్నవారు, 55 ఏండ్లు పైబడినా నెలసర్లు ఆగని స్త్రీలలో ఈ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ.
నెలసర్లు మధ్యలో, మోనోపాజ్‌ దశ దాటాక రక్తస్రావం కనిపిస్తే అల్ట్రాసౌండ్‌, హిస్టిరోస్కోపి, బయాప్సి వంటి పరీక్షలు తప్పనిసరి.

వజైనల్‌ మరియు పల్వా క్యాన్సరు :
ఇది స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి బయటకు కనిపించే అవయవాలు, యోని, యోని పెదాలకు సంబంధించిన క్యాన్సర్లు. అరుదుగా కనిపించేవే కానీ, ఈ అవయవాలు క్యాన్సర్‌కు గురయితే ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం మరింత కష్టతరం. అదుపులో పెట్టి జీవితకాలం పెంపొందించడం కూడా అంత సులువేమీ కాదు. మోనోపాజ్‌ వయస్సులో థైరాయిడ్‌ హార్మోన్‌ సమస్య ఉన్నవారిలో, హెచ్‌.వి.పి. వైరల్‌, హెపటైటిస్‌ సి వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ లేదా కచ్చితమైన కారణం తెలియకుండా వచ్చే ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ అయిన “లైకస్‌ స్లీరోసస్‌” అనే చర్మవ్యాధి వలన స్త్రీలకు యోని ప్రాంతంలో తెల్లటి మచ్చలు, దురదలు కలిగి మచ్చలు పడుతాయి. వీటివల్ల “వల్వార్‌ కార్సినోమా” అనే చర్మ సంబంధ క్యాన్సర్‌ వచ్చే రిస్క్‌ చాలా ఎక్కువ. ‘లైకన్‌ స్ల్కిరోసిస్‌’ చర్మ వ్యాధి ఉన్న స్త్రీలు ట్రీట్‌మెంట్‌ తీసుకోవడంతోపాటు తప్పనిసరిగా క్యాన్సర్‌ వంటి మార్పులు ఏమైనా చోటు చేసుకుంటున్నాయా అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి.

స్త్రీలు గైనిక్‌ క్యాన్సర్స్‌కు చెక్‌ పెట్టాలంటే పాప్‌స్మియర్‌
పరీక్షలు చేయించుకుంటూ ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.

 1. పొత్తి కడుపు బరువుగా, పెరుగుతున్నట్లు ఉండటం.
 2. అసాధారమైన యోని స్రావాలు, రక్తస్రావం.
 3. కలయిక సమయంలో రక్తం కనిపించడం.
 4. నెలసర్లు ఆగిపోయిన కొంతకాలం తర్వాత రక్తస్రావం.
 5. అలసట, జ్వరం, బరువు తగ్గడం.
  గైనకాలజికల్‌ క్యాన్సర్లను ఇతర శరీర భాగాలకు వ్యాపించక ముందే గుర్తిస్తే, హిస్టరెక్టమి లేదా ఊఫరెక్టమిలను చిన్నకోతతో చేసే సర్జరీల ద్వారా చేయించుకున్న వెంటనే కీమో, రేడియో థెరపిలను తగినంత కాలం తీసుకోవడంతో ఈ క్యాన్సర్లను పూర్తిగా అదుపులో ఉంచడం సాధ్యమవుతుంది.

మోనోపాజ్‌ దశకు చేరుకున్న స్త్రీలకు నెలసర్లు పూర్తిగా ఆగిపోయిన ఒక సంవత్సరం తర్వాత, రక్తస్రావం అప్పుడప్పుడు అయినా, తరచుగా అయినా లేక చాలా కొద్దిగా రక్తం కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. స్త్రీలు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు “ఏంటి? మళ్లీ ఈ వయస్సులో నెలసర్లు మొదలయ్యాయి. ఎవ్వరితో చెప్పుకోను” అని మొహమాట పడుతూ ఉంటారు. కానీ, మొహమాటపడి నిర్లక్ష్యం చేయాల్సిన సందర్భం కానే కాదు అని గుర్తుంచుకోవాలి.

డాక్టర్‌ మోహనవంశీ
చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, ఒమేగా హాస్పిటల్స్‌
హైదరాబాద్‌: 9848011421
కర్నూల్‌: 08518-273001
గుంటూర్‌: 0863-2223300

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana