మైగ్రేన్ అనేది చాలా సాధారణమైన, తరచుగా ఇబ్బందిని కలిగించే తలనొప్పి రోగం. దీని కారణంగా మానవుని సాధారణ జీవితం యొక్క నాణ్యత తగ్గడం జరుగుతూ ఉంటుంది. మైగ్రేన్‌ను ప్రధానంగా ఇరవై నుంచి ముప్పై ఏండ్ల వయస్సు వారిలో ఎక్కువగా చూస్తుంటాం. అయినప్పటికీ స్కూల్‌కి వెళ్ళే పిల్లల్లో, వృద్ధుల్లో కూడా చూడవచ్చు. మైగ్రేన్ వచ్చిన కొంతమందిలో సాధారణ జీవితం గడపలేని స్థితి, స్కూల్‌కు మరియు ఉద్యోగానికి సరిగ్గా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతున్నది. తద్వారా స్కూల్లో, కాలేజీలో, ఆఫీసులో సరైన ఫలితాలు సాధించలేకపోవడం జరుగుతూ ఉంటుంది.
మైగ్రేన్ సాధారణంగా ఏకపక్షంగా మొదలై మధ్యస్థం నుంచి తీవ్రమైన తలనొప్పిగా మారుతుంది. రోజూవారీ కార్యకలాపాలతో ఈ తలనొప్పి తీవ్రత పెరుగుతుంటుంది. మైగ్రేన్ తలనొప్పి సాధారణంగా కొన్ని గంటలు మొదలుకొని 1-2 రోజుల వరకు ఉంటుంది. తలనొప్పితోపాటు వికారం, వాంతులు, తలతిరగడం, వెలుతురు చూసినా, పెద్ద శబ్దాలు విన్నా చిరాకు రావడం తరచుగా చూస్తుంటాం. పేషెంట్ ఒక నిశ్శబ్దమైన చీకటి గదిలో కూర్చోవడానికి ఇష్టపడతారు. కొంతమంది పేషెంట్స్‌కు తలనొప్పి మొదలయ్యే ముందు కంటిముందు జిగ్‌జాగ్ లైన్స్ కనిపించడం, చెవుల్లో గుయ్యిమనే శబ్దం రావడం జరుగుతుంటుంది. వీటిని ఆరా (AURA) అని అంటాం. చాలామంది పేషెంట్స్‌లో తలనొప్పి ప్రారంభానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలుంటాయి. ఎక్కువ ఒత్తిడికి లోనవ్వడం, సమయానికి భోజనం తీసుకోకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, దూర ప్రాంతాలు ప్రయాణించడం వంటి సందర్భాలు సాధారణంగా మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంటాయి. కొద్దిమందిలో మద్యం సేవించడం, హార్మోన్ లెవల్స్‌లో హెచ్చుతగ్గులు, వాతావరణంలో మార్పులు, కొన్ని రకాలైన బలమైన వాసనలు, ప్రకాశవంతమైన వెలుతురు చూడడం, కొన్ని రకాలైన ఆహార పదార్థాలు తినడం వంటివి మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తాయి. తలనొప్పి మొదలయ్యే ముందు అలసటగా ఉండటం, ఏకాగ్రత కోల్పోవడం, మెడనొప్పి, ఎక్కువగా ఆవలించడం, వికారం, మానసిక కల్లోలం లాంటివి సాధారణంగా చూస్తుంటాం. తరచుగా మైగ్రేన్ తలపొప్పి రావడంతో కొంతమంది సరిగ్గా పనికి హాజరు కాలేకపోవడం, చేసే పనిలో ఏకాగ్రత కోల్పోవడం జరుగుతుంటుంది. తద్వారా చదువులో మరియు పనిలో సరైన ఫలితాలు రాబట్టకపోవడం జరుగుతుంది.
తరచుగా తలనొప్పి వచ్చేవాళ్ళలో నిద్రలేమి వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. తద్వారా జీవిత నాణ్యత తగ్గిపోతుంటుంది. కొంతమందిలో తలనొప్పి క్రానిక్ మైగ్రేన్‌గా ఆవిర్భవిస్తుంది. వీరిలో నెలలో పదిహేను రోజుల కంటే ఎక్కువగా తలనొప్పితో బాధపడతారు. ఈ క్రానిక్ మైగ్రేన్‌కు ప్రధాన కారణాలు తలనొప్పి మందులు మరీ ఎక్కువగా తీసుకోవడం, తలనొప్పి వచ్చినప్పుడు సరైన చికిత్స తీసుకోకపోవడం, ఊబకాయం, నిద్రలేమి సమస్యలు, ఎక్కువగా కాఫీ తీసుకోవడం, మానసిక రోగాలు వంటివి ఉన్నాయి.
వ్యాధి నిర్ధారణ
పేషెంట్ యొక్క తలనొప్పి లక్షణాలు, తలనొప్పికి దారితీసే ప్రత్యేక సందర్భాలు క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారించవచ్చు. సీటీ స్కాన్‌గానీ, ఎంఆర్ఐ సాధారణంగా అవసరం లేదు.
Dr. Vijay Kumar Boddu
MBBS,MD,DM(Neurology)
Consultant Neurologist
Renova Hospitals, Kompally
Contact No: 9121241005