మనిషి జీవితం శ్వాస చుట్టూ తిరుగుతుంది. శ్వాస ఆగితే.. బతుకు బండి ఆగిపోతుంది. ఎలాంటి అవరోధాలూ లేకుండా శ్వాస తీసుకోవాలంటే ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయాలి. ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా
ఎన్నో కొన్ని రోజులు బతకవచ్చు. కానీ శ్వాస తీసుకోకుండా నిమిషమైనా మనుగడ సాగించలేం. మనం నిద్రపోతున్నా సరే శ్వాస వ్యవస్థ పనిచేయాలి. శ్వాస తీసుకోవడం అంటే గాలిని పీల్చి అందులోని ప్రాణవాయువును తీసుకుని, కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటికి వదలడం. ఈ ప్రక్రియ మొత్తం ఊపిరితిత్తుల ద్వారానే జరుగుతుంది. ఊపిరితిత్తులు అవసరానికి తగినట్టు సంకోచ, వ్యాకోచాలు చేస్తుంటాయి. ఇవి
సక్రమంగా పనిచేస్తేనే శరీరానికి ఆక్సిజన్ అందుతుంది. కానీ, మనిషికి ఊపిరినిచ్చే ఊపిరితిత్తులను ‘ఫైబ్రోసిస్’ వ్యాధి కబళిస్తున్నది. సకాలంలో సరైన చికిత్స అందించకపోతే ప్రాణాలనూ హరిస్తున్నది.
లంగ్ ఫైబ్రోసిస్.. ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి. ఫైబ్రోసిస్…అంటే గట్టిపడటం. లంగ్ ఫైబ్రోసిస్ అంటే ఊపిరి తిత్తులు గట్టిపడటం. సాధారణంగా ఊపిరి తిత్తులు మనం గాలి పీల్చినప్పుడు వ్యాకో
చిస్తాయి, గాలి వదిలినప్పుడు సంకోచిస్తాయి. కొన్ని కారణాల వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన కండరాలు లేదా కణ జాలాలు గట్టిపడతాయి. ఫలితంగా ఊపిరి తిత్తుల్లో సంకోచ, వ్యాకోచం తగ్గిపోతుంది. శరీరానికి
ఆక్సిజన్ సరఫరా మందగిస్తుంది. ఈ సమస్యను ప్రారంభ దశలో గుర్తించడం అంత సులభం కాదు. ఎందుకంటే ఇది.. న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తుల జబ్బులను పోలి ఉంటుంది. అనుభవజ్ఞులైన వైద్యులు మాత్రమే లక్షణాలను కని పెట్టగలరు. వివిధ పరీక్షల ద్వారా వ్యాధిని కచ్చితంగా నిర్ధారించగలరు.
కారణాలు అనేకం
లంగ్ ఫైబ్రోసిస్ పలురకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. ముఖ్యంగా రక్త కణాలకు ఆక్సిజన్ సరఫరా ఇబ్బందికరంగా మారుతుంది. దీనివల్ల క్రమంగా రక్తపోటు, గుండె సంబంధవ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది. ఈ రుగ్మతకు అనేక కారణాలు..
వాతావరణ కాలుష్యం : తీవ్రమైన వాతావరణ కాలుష్యానికి ప్రభావితమైనప్పుడు ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ముఖ్యంగా ఘన లోహాలు కలిగిన ధూళి, ధాన్యపు దుమ్ము, పక్షులు లేదా జంతువుల
విసర్జితాలు, సిలికా, ఆస్బెస్టాస్, బొగ్గు ధూళి.. వంటివి ఊపిరితిత్తులకు హానికరం. బల హీనంగా ఉన్న శ్వాస వ్యవస్థను మరింత దెబ్బతీస్తాయి.
రేడియేషన్ చికిత్సలు :క్యాన్సర్ చికిత్స కోసం రేడియేషన్ తీసుకుంటున్న రోగులకు ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ సోకే ఆస్కారం అధికం.
కొన్నిరకాల ఔషధాలు : వివిధ వ్యాధుల చికిత్సలో భాగంగా తీసుకునే కొన్ని ఔషధాలు కూడా లంగ్ ఫైబ్రోసిస్‌కు దారితీస్తాయి.
అంటువ్యాధులు : కరోనా, హెపటైటిస్-సి, ఎడినో వైరస్, హెర్పిస్ వంటి వైరస్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ఊపిరితిత్తులు ఫైబ్రోసిస్‌కు గురవుతాయి. ఈ మధ్యకాలంలో ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ వల్ల కూడా చాలామంది రోగులు లంగ్ ఫైబ్రోసిస్ బారినపడ్డారు. అయితే కేవలం కరోనా వల్లనే ఈ వ్యాధి బారినపడలేదు. లంగ్ ఫైబ్రోసిస్ రావడానికి కరోనా వైరస్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
ఆటోఇమ్యూన్ వ్యాధులు : రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్లిరోడెర్మా, పాలిమయోసైటిస్, సర్కాయిడోసిస్ లాంటి ఆటోఇమ్యూన్ వ్యాధులు లంగ్ ఫైబ్రోసిస్‌కు దారితీస్తాయి.
చికిత్స అందకపోతే.. లంగ్ ఫైబ్రోసిస్‌కు సకాలంలో చికిత్స అందక పోతే కింది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
శ్వాసకోశ వైఫల్యం.
పల్మనరీ హైపర్ టెన్షన్.
లంగ్ క్యాన్సర్.
గుండె పనితీరు వైఫల్యం.
కానీ లంగ్ ఫైబ్రోసిస్ నిర్ధారణ అంత సులువు కాదు. ఇంతకుముందే చెప్పినట్టు న్యుమోనియాగానో, బ్రాంకైటిస్గానో భావించే ఆస్కారం ఉంది. కాబట్టి, పరీక్షలు అవసరం అవుతాయి.
ఆటో ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు.
రక్త ఆక్సిజన్ స్థాయి పరీక్ష- ఏజీవీ.
ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు-పీఎఫ్‌టీ, డీఎల్సీఓ.
కఫం/తెమడ పరీక్ష -అంటువ్యాధుల నిర్ధారణ కోసం.
సీటీ స్కాన్ హెచ్ఆర్సీటీ చెస్ ్ట- ఫైబ్రోసిస్ ఎంతమేర ఉందో తెలుసుకోవడానికి.
లంగ్స్ బయాప్సీ – ఫైబ్రోసిస్‌ను కచ్చితంగా నిర్ధారించవచ్చు.
ఇలా అరికడదాం..
లంగ్ ఫైబ్రోసిస్‌ను అధిగమించడానికి ఒకటే మార్గం. జీవనశైలి లోపాలను సరిచేసుకోవడం. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొన సాగించడం. ముందుగా, ధూమపానం మానేయాలి. అలర్జీ, ఆస్తమా నియంత్రణలో ఉండేలా జాగ్రత్తపడాలి. కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలి. లంగ్ ఇన్ఫెక్షన్ అదుపులో ఉంచుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. వ్యాయామం తప్పనిసరి. ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించాలి. న్యుమోనియా, ఫ్లూ వ్యాక్సిన్ క్రమం తప్పకుండా తీసుకోవాలి. శ్వాస వ్యవస్థకు సంబంధించి ఏ రోగ లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు.
చికిత్సా పద్ధతులు
సమస్య మూలాలను బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి వైద్య నిపుణులు చికిత్సా విధానాలను నిర్ణయిస్తారు. రుగ్మత నియంత్రణ కోసం అనేక ఔషధాలను సిఫారసు చేస్తారు.
కార్టికో స్టిరాయిడ్స్ : ఆటో ఇమ్యూన్ వ్యాధుల చికిత్స కోసం వీటిని వినియోగిస్తారు. ఈ వ్యాధులను నియంత్రిస్తే.. గట్టిపడిన ఊపిరితిత్తుల సమస్యను సహజంగానే నయం
చేయవచ్చు.
యాంటీ ఫైబ్రోటిక్ మందులు : ఇవి ఫైబ్రోసిస్ వ్యాప్తిని అడ్డుకుంటాయి.
ఆక్సిజన్ థెరపీ : శ్వాసను సులభతరం చేస్తుంది.
ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్) : సాధారణ చికిత్సలు పనిచేయనప్పుడు ఊపిరితిత్తుల మార్పిడే శరణ్యం.
ఛాతీ గట్టిపడినట్టు అనిపించడం.
గోళ్లు ఉబ్బడం లేదా వంకర పోవడం. డాక్టర్ నాగరాజు బోయిల్ల సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్
పార్థివ్ లంగ్ కేర్ సెంటర్, హైదరాబాద్
…?మహేశ్వర్‌రావు బండారి