Stomach Pain | స్వీట్లు, మసాలా ఆహారాలు, కొవ్వులు తిన్నాక కడుపునొప్పి వస్తుందా.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే..?
పండుగలు, వేడుకల సమయంలో నూనెలో వేయించిన పదార్థాలు, మసాలా కూరలు, స్వీట్లు వంటి రకరకాల ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం సాధారణం. ఇలాంటి విందు తర్వాత కడుపునొప్పి వస్తే చాలామంది అతిగా తినడం వల్లేనని భావిస్తారు.
Stomach Pain | పండుగలు, వేడుకల సమయంలో నూనెలో వేయించిన పదార్థాలు, మసాలా కూరలు, స్వీట్లు వంటి రకరకాల ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం సాధారణం. ఇలాంటి విందు తర్వాత కడుపునొప్పి వస్తే చాలామంది అతిగా తినడం వల్లేనని భావిస్తారు. అయితే అకస్మాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, జ్వరం లేదా పొత్తికడుపు ఉబ్బరం కనిపించడం సాధారణ జీర్ణ సమస్య కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇవి శస్త్రచికిత్స అవసరమయ్యే అత్యవసర పరిస్థితులకు సంకేతాలు అయ్యే వీలు ఉంటుంది. నొప్పి ఎక్కడ మొదలైంది, ఎటువైపు వ్యాపిస్తోంది అనే విషయాలు సమస్యను గుర్తించడంలో వైద్యులకు సహాయపడతాయి.
కొవ్వు పదార్థాలను అధికంగా తింటే..
కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకున్న తర్వాత పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారికి తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పిత్తాశయం ఆహారంలోని కొవ్వును జీర్ణం చేయడానికి అవసరమైన పిత్తరసాన్ని నిల్వ చేస్తుంది. అందులో కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు గట్టిపడి రాళ్లుగా ఏర్పడతాయి. ఈ రాళ్లలో ఏదైనా పిత్తరసం బయటకు వెళ్లే మార్గాన్ని అడ్డుకుంటే కుడివైపు పక్కటెముకల కింద లేదా పొత్తికడుపు పైభాగంలో నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి వెన్ను లేదా కుడి భుజం వైపు వ్యాపించి కొన్ని గంటలపాటు ఉంటుంది. వికారం, వాంతులు కూడా వస్తాయి. పిత్తాశయంలో వాపు ఏర్పడితే దాన్ని తీవ్రమైన పిత్తాశయ వాపు అంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆసుపత్రిలో చికిత్సతోపాటు పిత్తాశయాన్ని తొలగించే శస్త్రచికిత్స అవసరమవుతుంది. అలాగే పిత్తాశయ రాళ్లు లేదా అధికంగా మద్యం తీసుకోవడం వల్ల క్లోమగ్రంథిలో వాపు వచ్చే వీలు ఉంటుంది. దీనివల్ల పొత్తికడుపు పైభాగంలో తీవ్రమైన నొప్పి వచ్చి వెన్ను వరకు వ్యాపిస్తుంది. వాంతులు, జ్వరం, గుండె వేగంగా కొట్టుకోవడం కూడా కనిపిస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో మూత్రపిండాలు, ఊపిరితిత్తులు సహా ఇతర అవయవాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది.
అపెండిసైటిస్ అయితే..
అపెండిసైటిస్ సమస్యలో మొదట నాభి చుట్టూ నొప్పి మొదలై క్రమంగా పొత్తికడుపు కుడి దిగువ భాగానికి చేరుతుంది. నడిచినప్పుడు, దగ్గినప్పుడు లేదా కదిలినప్పుడు నొప్పి పెరుగుతుంది. ఆకలి తగ్గడం, వికారం, వాంతులు, జ్వరం కూడా ఉంటాయి. సాధారణంగా అపెండిక్స్ను శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. అది పగిలితే ఇన్ఫెక్షన్ పొత్తికడుపు అంతటా వ్యాపించి ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. పేగుల్లో అడ్డంకి ఏర్పడినప్పుడు నొప్పి అలలుగా రావడం, పొత్తికడుపు ఉబ్బడం, వాంతులు, మలం లేదా గ్యాస్ బయటకు రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గతంలో పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకోవడం, హెర్నియా లేదా కణితులు ఉండడం దీనికి కారణాలు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పేగులకు రక్తప్రసరణ తగ్గి వాటి గోడలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే కడుపు లేదా పేగుల్లోని పుండు రంధ్రం పడితే అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి, పొత్తికడుపు బిగుసుకుపోవడం, తాకితే నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జీర్ణరసాలు పొత్తికడుపులోకి చేరడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర శస్త్రచికిత్స, యాంటీబయాటిక్ మందులు అవసరమవుతాయి.
వైద్య పరీక్షల్లో తెలుస్తాయి..
ఆసుపత్రికి చేరుకున్న తర్వాత వైద్యులు నొప్పి ఎప్పుడు మొదలైంది, ఎక్కడ ఎక్కువగా ఉంది, ఎలా మారుతోంది అనే వివరాలను తెలుసుకుంటారు. గతంలో పొత్తికడుపు శస్త్రచికిత్సలు, పిత్తాశయ రాళ్లు, వాడుతున్న మందులు, ఇతర ఆరోగ్య సమస్యల గురించి కూడా అడుగుతారు. రక్తపరీక్షల ద్వారా ఇన్ఫెక్షన్, వాపు, క్లోమగ్రంథి పనితీరు, కాలేయ పనితీరులో మార్పులను గుర్తిస్తారు. అల్ట్రాసౌండ్ ద్వారా పిత్తాశయ రాళ్లు, వాపును తెలుసుకోవచ్చు. అపెండిసైటిస్, పేగుల్లో అడ్డంకి లేదా పుండు పడినట్లు అనుమానం ఉంటే సీటీ స్కాన్ ఉపయోగపడుతుంది. రోగి పరిస్థితిని బట్టి చికిత్స నిర్ణయిస్తారు. పిత్తాశయం, అపెండిక్స్ తొలగింపు వంటి కొన్ని శస్త్రచికిత్సలను చిన్న కోతల ద్వారా కెమెరా, ప్రత్యేక పరికరాలతో చేసే విధానం ద్వారా నిర్వహిస్తారు. కొన్ని క్లిష్టమైన సందర్భాల్లో రోబో సహాయక శస్త్రచికిత్సను కూడా ఎంచుకోవచ్చు.
ఈ వ్యాధులు ఉంటే జాగ్రత్త..
మధుమేహం, అధిక బరువు, పిత్తాశయ రాళ్ల చరిత్ర ఉన్నవారు కొత్తగా వచ్చే కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. తీవ్రమైన లేదా పెరుగుతున్న నొప్పి, పదేపదే వాంతులు, జ్వరం, కామెర్లు, తలతిరగడం, పొత్తికడుపు బిగుసుకుపోవడం లేదా ఉబ్బరం, మలం లేదా గ్యాస్ బయటకు రాకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. ఆమ్లత్వానికి మందులు లేదా నొప్పి నివారణ ట్యాబ్లెట్లను వేసుకుని ఇంట్లోనే ఉండిపోకూడదు. పండుగ విందు తర్వాత స్వల్ప జీర్ణ సమస్యలు వస్తాయి. కానీ తీవ్రమైన కడుపునొప్పిని మాత్రం సాధారణ సమస్యగా భావించకూడదని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stomach Pain | స్వీట్లు, మసాలా ఆహారాలు, కొవ్వులు తిన్నాక కడుపునొప్పి వస్తుందా.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే..?
తెరాటిగూడెం గ్రామవాసి కత్తి స్వాతికి జేఎన్టీయూహెచ్ డాక్టరేట్
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా దక్షిణాఫ్రికాలో 14 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
‘చేయూత పెన్షన్దారులకు న్యాయం చేయాలి’
MLA sudhir reddy | రేవంత్ తాగునీళ్లు కూడా దొరకవంటే.. ఉత్తమ్ తాగునీటి కొరత లేదంటాడు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

