Health Tips : వేడివేడి అన్నంలో నెయ్యి (Ghee).. పప్పులో నెయ్యి.. రోటీ (Roti) పై నెయ్యి.. ఇలా మన దేశంలో నెయ్యికి ఉన్న ప్రత్యేకతే వేరు. పెద్దలు నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంటారు. పసిపిల్లలకు నెయ్యి పెడితే బలమంటారు. రుచికి కూడా తిరుగుండదు. అయితే నెయ్యి అతిగా తింటే గుండె ఆరోగ్యం (Heart Health) పై ప్రభావం పడుతుందా..? నెయ్యి గుండెకు మేలు చేస్తుందా చెడు చేస్తుందా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..?
నెయ్యిలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల నెయ్యిలో దాదాపు 883 కిలోకేలరీలు ఉంటాయి. కాబట్టి నెయ్యిని మితంగా తీసుకుంటే సమస్య లేదు. అతిగా తీసుకుంటేనే కొవ్వు పేరుకుంటుంది. కాబట్టి నెయ్యిని తరచూ తినడంతో సమస్య ఉండదు. నెయ్యిని ఎంత మోతాదులో తీసుకుంటున్నామన్నదే అసలు సమస్య. పప్పుకు ఓ చెంచా.. అన్నానికి మరో చెంచా.. రోటీకి ఇంకో చెంచా.. ఇలా రోజంతా తెలియకుండానే నెయ్యి పరిమాణం పెరిగిపోవచ్చు. అదే అలవాటు కొనసాగితే శరీరంలోకి అవసరానికి మించిన కొవ్వు చేరుతుంది.
శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడంవల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ ఎక్కువ కాలం అధికంగా ఉంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది గుండె జబ్బుల ముప్పును పెంచుతుంది. కాబట్టి రోజూ నెయ్యి తినే అలవాటు మంచిదే అయినా.. మోతాదుకు మించకుండా చూసుకోవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యంగా ఉన్న పెద్దవాళ్లు రోజుకు ఒకటి నుంచి రెండు టీస్పూన్ల నెయ్యిని తీసుకోవచ్చు.
అయితే నెయ్యితోపాటు వంట నూనెలు, వెన్న వంటి అన్ని కొవ్వుల పరిమాణాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఇప్పటికే గుండె జబ్బులు, మధుమేహం లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు నెయ్యి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వారి ఆహారంలో కొవ్వుల పరిమాణాన్ని వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడి సూచన మేరకు నిర్ణయించుకోవడం మంచిది. కాబట్టి నెయ్యిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. వంటలో సుమారుగా కాకుండా చెంచాతో కొలత చూసుకుని వాడటం అలవాటు చేసుకోవాలి. వంట చివర్లో కొద్దిగా నెయ్యి వేసినా మంచి రుచి, వాసన వస్తాయి.