అతిసార బారినపడితే..
వానకాలంలో పిల్లల్ని తీవ్రంగా ఇబ్బందిపెట్టే సమస్య అతిసార. తక్షణ చర్యలు తప్పనిసరి. అతిసార వ్యాధివల్ల విరేచనాల రూపంలో శరీరం కోల్పోయే నీరు, ఖనిజ లవణాలు, బైకార్బొనేట్, ఆహార పదార్థాలను తిరిగి సమకూర్చడమే వైద్యం ముఖ్య ఉద్దేశ్యం. వ్యాధి ప్రారంభం కాగానే ఇంట్లో లభించే ద్రవ పదార్థాలతోనే చికిత్స మొదలుపెట్టవచ్చు. బలహీనత చిహ్నాలు కనిపించనంత వరకూ ఈ జాగ్రత్తలు సరిపోతాయి.

ఆహారం: అన్నం వార్చిన గంజి; పప్పు, నీరు, ఉప్పు వేసిన చల్ల, లస్సీ; గోధుమ పాయసం, బియ్యపు పాయసం, బార్లీ గంజి, సగ్గుబియ్యం జావ, రాగి గంజి.
పండ్ల రసాలు: కొబ్బరి నీరు, టమాట సూపు, క్యారెట్ సూపు, నిమ్మ, నారింజ, బత్తాయి రసాలు, అరటి పండు, సపోట. వీటిని ఇతర ఆహార పదార్థాలతో కలిపి ఇస్తే బాగా పనిచేస్తాయి.
ఏమిటిది?
విరేచనం ద్వారా కోల్పోయే ప్రధాన పదార్థాలను తిరిగి శరీరానికి సమకూర్చడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన గ్లూకోజ్, లవణ మిశ్రమమే ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్). దీనిని కనిపెట్టి దాదాపు యాభై ఏండ్లయింది. ఇప్పటి వరకూ ఓఆర్ఎస్.. మిగతా మందులతో పోలిస్తే అతి ఎక్కువమంది ప్రాణాలను రక్షించింది. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి కనీసం 10 లక్షలమంది పిల్లలను మృత్యుముఖం నుంచి కాపాడింది.అతిసార వ్యాధి ఉన్న 90 శాతం పిల్లలకు ఓఆర్ఎస్ ఒక్కటే సరిపోతుంది. మిగతా 10 శాతం పిల్లలకు దీంతోపాటు వైద్యం అవసరం. అతిసార వ్యాధికి కారణం ఏదైనా, శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి సమకూర్చడానికి ఇదే ఆధారం. ఓఆర్ఎస్లో సోడియం క్లోరైడ్ 2.6 గ్రా, పొటాషియం క్లోరైడ్ 1.5 గ్రా, సోడియం సిట్రేట్ 2.9 గ్రా, డెక్స్ట్రోస్ 13.5 గ్రా. ఉంటాయి.
తయారీ విధానం
ఓఆర్ఎస్ తయారీకి నీటిని తప్పనిసరిగా మరిగించాల్సిన పనిలేదు. కలిపేముందు శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. పొడిని కొద్దికొద్దిగా కాకుండా, మొత్తం ప్యాకెట్‌ను సూచించిన మోతాదులో నీటిలో ఒకేసారి కలపాలి. దీనివల్ల ఒకసారి చిక్కగా, ఒకసారి పలుచగా కాకుండా మొత్తం సరైన సాంద్రత కలిగిన ద్రావణం తయారవుతుంది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ మార్గదర్శకాల ప్రకారం ఒక లీటరుకు సరిపోయేంత పరిమాణంతో ప్యాకెట్లు రూపొందించినా, మార్కెట్లో పిల్లలకోసం 200 మి.లీ. నీటిలో కలపడానికి అనువుగానూ లభిస్తాయి. పొడిని కలపడానికి పరిశుభ్రమైన పాత్రలనే ఉపయోగించాలి. ఒకసారి తయారుచేసిన ద్రవాన్ని 24 గంటల వరకే ఉపయోగించాలి.
వాంతులు అయితే?
పెద్ద పిల్లలకు గ్లాసు లేదా కప్పుతో కోరినంత ఇవ్వవచ్చు. చిన్నపిల్లలకు 2-3 నిమిషాలకోసారి, చెంచా చొప్పున ఇస్తే సరిపోతుంది. ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేస్తున్న పిల్లలకు తాగే శక్తి రాగానే ఓఆర్ఎస్ ఇవ్వాలి. ఇది సాధారణంగా 3-4 గంటల్లో సాధ్యపడుతుంది. ఓఆర్ఎస్ ఒకేసారి ఎక్కువగా ఇస్తే కడుపుబ్బి వాంతి కావచ్చు. అలాంటప్పుడు పది నిమిషాలు ఆపి మళ్ళీ ఇవ్వాలి. వాంతులు ఎక్కువగా ఉంటే కొద్దిగా నీళ్లు ఇవ్వవచ్చు. ఓఆర్ఎస్ ఏ విధంగా ఇచ్చినా వాంతులు తగ్గనట్లయితే, పిల్లలను ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేయాలి.
ఏ వయసు పిల్లలకు, ఎంత మోతాదులో?
2 నెలలు – 25 మి.లీ. ప్రతి విరేచనానికి.
2 నెలల నుంచి 2 సంవత్సరాలు – 50 నుంచి 100 మి.లీ.
2 నుంచి 10 సంవత్సరాలు – 100 నుంచి 200 మి.లీ.
10 సం.ల తర్వాత – అవసరం ఉన్నంత.
డాక్టర్ కర్రా రమేష్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- child food
- Food
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

