మా బాబు వయసు 10 సంవత్సరాలు. రెండు మూడు నెలలుగా తలనొప్పి అంటున్నాడు. వైద్యులను సంప్రదిస్తే పరీక్షలు చేసి, అంతా బాగానే ఉందని చెప్పారు. చదవడం ఇష్టంలేక అలా అంటున్నాడేమోనని అనుమానంగా ఉంది. బాగా చదువట్లేదనే కంప్లయింట్ ఉపాధ్యాయుల నుంచి కూడా రాలేదు. ముందునుంచీ బాగానేచదువుతాడు. ఈ మధ్య తరచూ తలనొప్పి అంటుంటే ఆందోళనగా ఉంది. ఈ తలనొప్పి ప్రమాదకరమా? సమాధానమివ్వండి.
– ఓ పాఠకురాలు
మీ పిల్లవాడికి వైద్య పరీక్షలూ చేయించామని చెప్పారు. కానీ, ఎలాంటి పరీక్షలు చేయించారనేది తెలపలేదు. పిల్లల్లో తలనొప్పి రావడం సహజం. కానీ, అది ప్రమాదకరమైనదా.. కాదా అనేది తెలియాలంటే పిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో గ్రహించాల్సి ఉంటుంది. తలనొప్పితోపాటు వాంతులు, ప్రవర్తనలో మార్పులు, ఎప్పుడూ పడుకొని ఉండటం, పనులు శ్రద్ధగా చేయకపోవడం, ఫిట్స్ రావడం వంటివి ప్రమాదాన్ని సూచించే లక్షణాలు. పీడియాట్రీషియన్ సమక్షంలో కంటిచూపునకు సంబంధించి పరీక్షలు చేయాలి. కళ్లద్దాలు అవసరమో, కాదో చూసుకోవాలి. మెదడు పనితీరు, నరాల పనితీరు, నాడీ కణాల పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయాలి.
మెదడులో ఏదైనా కణితి ఉంటే తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. అంతేకాకుండా మీ కుటుంబంలో ఎవరికైనా పార్శపునొప్పి ఉందా.. లేదా అనే విషయం కూడా మీరు చెప్పలేదు. అలాంటిదేమైనా ఉంటే పిల్లలకు కూడా మైగ్రెయిన్ రావొచ్చు. ఈరోజుల్లో చాలామంది పిల్లలు ఎక్కువసేపు ఫోన్, ట్యాబ్లెట్, టీవీలతోనే గడుపుతున్నారు. వీటి ప్రభావం వల్ల తలనొప్పి, కళ్ల నుంచి నీరు రావడం, చూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముందుగా పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. బ్రెయిన్ ట్యూమర్ అని ముందే ఊహించుకొని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరమైతే పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్ను సంప్రదించి, సమస్య గురించి తెలిసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్