ఒక్కేసి పువ్వేసి చందమామ
బతుకమ్మ’ బతుకునిచ్చిన అమ్మ, తెలంగాణ ఆడపడుచులంతా భక్తిగా కొలుచుకునే అమ్మ మా బతుకమ్మ. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణలోని ప్రతి ఊరూవాడ అందంగా ముస్తాబవుతుంది. తెలంగాణమంతా పువ్వుల కోనేరవుతుంది. తెలంగాణ ఆడబిడ్డలు ఆడుతూ పాడుకునే బతుకమ్మ పాట కేవలం పాట కాదు. బతుకు విలువ నేర్పే పాఠాలు
‘బతుకమ్మ’ బతుకునిచ్చిన అమ్మ, తెలంగాణ ఆడపడుచులంతా భక్తిగా కొలుచుకునే అమ్మ మా బతుకమ్మ. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణలోని ప్రతి ఊరూవాడ అందంగా ముస్తాబవుతుంది. తెలంగాణమంతా పువ్వుల కోనేరవుతుంది. తెలంగాణ ఆడబిడ్డలు ఆడుతూ పాడుకునే బతుకమ్మ పాట కేవలం పాట కాదు. బతుకు విలువ నేర్పే పాఠాలు. తెలంగాణ సంస్కృతితో, ప్రజల జీవనవిధానంతో మమేకమైన సజీవ సంస్కృతికి ప్రతి రూపాలు ఈ బతుకమ్మ పాటలు. అటువంటి మనకు తెలిసిన మన ఘనమైన బతుకమ్మకు మరో రూపం ఇచ్చారు బాలల మనసెరిగిన బాల సాహితీవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్.
బతుకమ్మ గురించి, ఆ మహోన్నత సంస్కృతి గురించి ముందుతరాలకు చెప్పాలన్న సంకల్పంతో పిల్లల కోసం ‘బాలల బతుకమ్మ గేయాలు’ రాశారు పత్తిపాక మోహన్. తన బాల గేయాల్లో బతుకమ్మను గురించి వివరంగా పిల్లలకు విప్పిచెప్పారు. వాటన్నింటిని ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ పేరు తో సంకలనంగా తీసుకువచ్చారు. ఇది మన బాలల కోసం బతుకమ్మ గేయాలతో వచ్చిన మొదటి పుస్తకంగా చెప్పుకోవచ్చు. ‘బాల సాహిత్యం’ అంటే ఎక్కువగా కథల గురించే చెప్పుకొంటాం. అయితే కథలతో పాటు బాలగేయాలు, పద్యాలు కూడా బాలసాహిత్యంలో విశిష్ట స్థానాన్ని ఏర్పర్చుకున్నాయి. బాల గేయాల గొప్పదనం. ఏమిటో చెప్పడానికి’ ‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అనే ఒక్క గేయం చాలు.
పిల్లలకు తొందరగా చేరువయ్యే బాల గేయాల ద్వారా ‘బతుకమ్మ’ విశిష్టతను తెలియజెప్పడానికి చేసిన ప్రయత్నమే ఈ ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ బాలల బతుకమ్మ గేయాల తొలి సంపుటి. ఇందులోని ప్రతి గేయం బతుకమ్మలోని తీరొక్క పువ్వులాగా బతుకమ్మ సంస్కృతిని, విశిష్టతను తెలుపుతుంది.
‘చిన్నా పెద్దా లేదు ఉయ్యాలో
కులమతాలు లేవు ఉయ్యాలో అందరం ఒక్కటే ఉయ్యాలో అక్కచెల్లెండ్లం ఉయ్యాలో..
అంటూ సాగే ‘బతుకమ్మ’ గేయం తెలంగాణ ప్రజల ఐకమత్యాన్ని, బతుకమ్మ పం డుగ సాధించి నిలిచిన సబ్బండవర్ణాల మేలిమి సంస్కృతిని తెలుపుతుంది. ‘బొడ్డెమ్మ’ పండుగ నుంచి బతుకమ్మ సంబురాలు మొదలవుతాయి. ‘బొడ్డెమ్మ’ గేయంలో మొదటిరోజు బొడ్డెమ్మ పండుగ మొదలైననాటి నుంచి బొడ్డెమ్మను సాగనంపేవరకు జరిగే క్రమాన్ని ఇందులో చక్కగా వివరిస్తారు మోహన్. చరిత్రలో బతుకమ్మ పాత్ర ఎంత అంటే ఒక్క మాటలో చెప్పలేనంత. ఆ గొప్పదనాన్నే ‘ఘనమైన బతుకమ్మ’ అనే గేయంలో ఇలా చెప్తారు కవి..
‘ఉద్యమాల బాటలోనే కోల్
ఊపిరులు నింపింది కోల్
తెలంగాణ సాధనలో కోల్
జండాగా ఎగిరింది కోల్..’
ఆడబిడ్డలందరూ ఆనందంగా జరుపుకునే ఈ పండుగను ’బంగారు పండుగ’ అంటూ..
‘ఆడబిడ్డలందరూ ఉయ్యాలో
ఆడుతూ పాడుతూ ఉయ్యాలో’
అని పుట్టింటికి వచ్చినప్పుడు తమ వాళ్ళతో పంచుకునే ఆనందాల గురించి చెప్తారు. బతుకమ్మ పండుగ తెలంగాణ మట్టి సంస్కృతికి, జీవన సౌందర్యానికి, ఆత్మగౌరవానికి, ఉనికికి ఆనవాలు. అటువంటి పండుగ గురించి కవి పత్తిపాక మోహన్ ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ అనే గేయంలో అద్భుతంగా పిల్లలకు కండ్ల కు కట్టేట్టుగా వివరిస్తారు. ఈ పండుగ ప్రకృతికి చేసే మేలు. ఆ మేలునే ‘పూల జాతర’ అనే గేయంలో ఇలా చెప్తారు.
‘తంగేడు గునుగులు
చెరువులకు ఎరువులు
బీర చిక్కుడాకులు
నీటి శుద్ధి మందులు
అచ్చమైన పండుగ’
అంటూ బతుకమ్మ పండుగ ఊరికి, చెరువుకు చేసే మేలును, తరాలుగా అపార విజ్ఞానవంతులైన తెలంగాణ జానపదులు ఈ పండుగను ఏ వైజ్ఞానిక దృక్పథాన్ని ఆశించి చేసేవారో కూడా నేటితరానికి తెలిసేట్టు చెప్తారు మోహన్.
కవి, రచయిత, బాల సాహితీవేత్త అయి న డాక్టర్ పత్తిపాక మోహన్ ప్రత్యేకించి పిల్లల కోసం రాసిన ఈ ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ బాలల బతుకమ్మ గేయాల సంకలనం సరైన సమయంలో వచ్చింది. ఇందులోని ప్రతి గేయంలో మన సంస్కృతిని, సంప్రదాయాన్ని, ఆటపాటలను, ఆచారవ్యవహారాలు, సద్దులు, పలారాలను నేటితరానికి సులభంగా అర్థమయ్యే రీతిలో తెలిపారు కవి. సరళమైన భాష, పిల్లలు హాయిగా పాడుకునే బాణీలో ఉన్న ఈ గేయాలు బాలలను ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. బతుకమ్మ ఇలా పత్తిపాక మోహన్ చేతిలో బాలగేయమై మెరవడమే కాక అందరినీ అలరిస్తుందని ఆశిద్దాం.
– డాక్టర్ సిరి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

