వచ్చె శోభకృత్వత్సరం
సీ!!సుమ మంజరుల్ ఘన శోభాకృతంబున
విశ్వంభరంబున విందు గూర్చ
కింకిరంబుల కంఠ కీర్తనా కౌశలం
శ్రవణ సౌభాగ్యమై శ్రాంతి గొలుప
మోదాఖ్యతతు లతి మోదంబునన్ దూగి
అతులిత హరితంబు నందు కొనగ
ఘర్మదీధితి కడు ఘర్మంబు ఘట్టనన్
ఆర్ద్రగాత్రంబున నతివలు జన
తే!!వచ్చె శోభకృత్వత్సరం పరుగు లిడుచు
పంచె పారిభద్ర పటీర పరిమళమ్ము
తెచ్చె దీవనల్ దైవసదేశ మలరి
త్రుంచె దివ్యాస్త్రమున లోక దుష్ట గుణము
– వూట్ల భద్రయ్య 95502 56840
శోభకృతు సుస్వాగతం
శోణరత్నజిగియు శుకకేకికికినెంచి
భద్రాసనమలరి భవితనుడువ
కృకవాకమేల్కొల్పు గృహమెక్కినినదింప
తుహినజల్లులసోలి తులసిమెరయ
ఉర్విపైకదలాడు సర్వజీవులమది
గారవిల్లబడుతు గంతులిడగ
దివిజగణంబును భువినిజేరగవచ్చి
కిమ్మీరసంతతిన్ దుమ్ముదులుప
సుస్వరాలపికము శోభితజగతికిన్
స్వాదురసమొసంగి సౌఖ్యమరయ
గతమువెతలమరచి కలికాలవర్తనల్
తంత్రమెఱిగిధరను తనియబడియె.
– రాకుమార
95501 84758
సాదృశం
అరుణ గిరిని కుంచెగ మలచి
మురిపాల పాలకడలిని తలచి వలచి
అందాల అపరంజి ప్రకృతి కన్య
ఉషోదయ వేళలో సోయగాల ఆరబోత
తొలకరి చినుకుల వానపాటలో
తడిసిన తనువును తన్మయత్వంతో
చూపు తిప్పని తీక్షణ నేత్రాలు
ఆకాశంలో ఆలపించిన అలల గీతాలు
పైరగాలి సంగీతానికి సెలయేటి గానంలో
జలపాతాల జోరులో నదులు నాట్యమాడగ
ఒంపుసొంపులు నింపుకున్న కొండకోనల
పచ్చదనపు పరవళ్లతో పుడమి పులకరించె
సాయంసంధ్యా సమయంలో
నచ్చిన నెచ్చెలి వెచ్చని తోడులో
తళుకులీనే తారాజువ్వలు
గోముగా కైపెక్కించే చెక్కిలి సొబగులు
ఋతువు ఋతువుకు
ఋతురాగాలు పలకరించగ
శిశిరం నింపిన చైతన్యంతో
వాసంత వైభవం ‘శోభకృత’మవగా
ఊయలలూగే ప్రకృతి పరిణయం
ఉత్తేజపరిచే ఊహల సౌరభం
ప్రకృతి ప్రదీప్త రమణీయతకు
ఆబాల గోపాలం పునఃరంకితమవగా
అబ్బురపరిచే అపురూప చిత్రరాజమై
సాక్షాత్కరించిన హరిత సాదృశం
విరుల హరివిల్లు ఆవిష్కృతం!
– గంగాపురం శ్రీనివాస్
96763 05949
ప్రశ్నగా మిగిలా
ఓ శోభకృత్!
కొత్తగా పేరు మార్చుకుని వస్తున్నావే కానీ!
కొత్తదనం ఏం తెస్తున్నావని ప్రతి ఏడాది
మనసులోని మాటను అడగాలనుకుంటా..
ఎందుకోగానీ నీవొస్తే నాక్కూడా చెప్పకుండానే
ఆకలిదప్పులు నన్నొదిలి పారిపోతాయ్
ఇక అడగాలన్న ధ్యాసెక్కడుంటుంది చెప్పు?
నీ రాకనంత వెన్నెల చేసుకుని మురిపిస్తావు
వసంతమై పరవశిస్తావు, కోకిలవై పలకరిస్తావు
పల్లెతనాన్నంత మోసుకొస్తావు, మోహిస్తావు.
ఊర చెలిమెలో కొత్త నీరు ఉబికివచ్చినట్టు
ఎండిన మాను చిగురేసి మామిడి పిందెలిచ్చినట్టు
కండ్లనిండా కాంతులు నింపి కవ్విస్తావు.
చేదు వేప తేనెలూరే తీపిని పంచినట్టు
కొత్త చింతకాయ వలపు పులుపు తెచ్చినట్టు
మనసు నిండా మధురాలను నింపేస్తావు.
చెరుకు ముక్కలు తీపి అమృతాన్నిచ్చినట్టు
కరుగుతున్న కాలానికి పువ్వై విరబూసినట్టు
పొడుస్తున్న పొద్దోలే ఉగాదివై ఉదయిస్తావు.
నీవు పంచే పంచామృతం లాంటి జ్ఞాపకాలు
మరిచిపోని, మరువలేని ఆనంద క్షణాలు
అందుకే!
నిన్ను అడగాలనుకున్నదేదీ అడగలేక
అడిగి నీవు పంచే తీపిని వదలుకోలేక
ప్రతిసారి నాకు నేనే ప్రశ్నగా మిగులుతున్నా..
– మధుకర్ వైద్యుల
80966 77409
————–
నా కృతి-శోభకృతి
శోభకృత్తు గత సారస్వత
హరిద్రా రుచుల కాంతులై
ప్రతిగడపలో-గర్భాలయంలో
మలయమారుత ప్రాణమవ్వాలి!
విశ్వశ్రేయస్సుకై
శ్రీయుతం సంపూర్ణమవ్వాలి!
మన మాతృ భాష
-గంగాధర(భగీరథ) హృదయఘోష!
పుడమికడుపు శ్వాస -వృక్షభాష!
అందుకే ఈ శంకర శంఖారావం!
ఇదే పంపా భీమా చక్ర హృదయగతం!
ఇదే భాగవత ద్యుతి! శ్రీ శైల విభూతి!
మంజీర లహరీ పదనాద ఝంకృతి!
ప్రతి గుండె గుడిలోపారిజాతం
పరమార్థం అవ్వాలి!
బడిలో అశోక ధర్మచక్రమవ్వాలి!
మన వాక్కు-సింగిడవ్వాలి!
ఈ శోభకృతి-సుకృతి యై
గౌతమీ అంతరంగమై జగన్నాదమవ్వాలి!
పొలాల అరిటాకుల పంక్తి భోజనాలలో-
సత్యసంకల్పం -పాలపిట్టలవ్వాలి!
ఈ సుందరం విజయ శుభ సూచిక…
ఇదే వసంతరాగాల వరాక్షమాలిక!
అమ్మా నీవిచ్చిన ఈ కలం నెమలీక!
ఇదే హృదయ దయా పూర్ణవేదిక!
ఇదే హంసికా కళధవళపత్రనివేదిక!
– డాక్టర్ పింగళి గంగాధర్ రావు
90141 01975
——————————————-
తెలుగిళ్ల రావమ్మ
శ్రీకర శుభకరమై వర సిరులు తేవె
శ్రీ శోభకృత్ ఉగాదివై వెలుగు లీవె
శిశిరం రాల్చిన కొమ్మల చివురులిచ్చి
చితికిన గత బతుకుల చిగురులిచ్చి
మనుషులందరికీ మంచి మనసునిచ్చి
చైత్రమాసపు అందచందాలు ధాత్రికిచ్చి
వంట మంట చమురు ఇంటి మట్టు ధరలు
మహిళల బడుగులపై అఘాయిత్యాలు
ప్రజాస్వామ్య హక్కుల అణచివేతలు
రూపుమాపగ ఏలికల మనసు మార్చి
సగటు జీవుల బ్రతుకుల వెలుగు లీని
తెలుగు ఇళ్లకు రావమ్మ వరము లీని
శాతవాహన రాజుల శౌర్య రీతి
వేగి చాళుక్య చోళుల విజయ గీతి
కాకతీయుల ఘన కీర్తి కదనరీతి
ఓరుగల్లు అమరావతుల తేజరీతి
మాట తెలంగాణ గోదావరి వెల్లువై
పాట ఆంధ్ర కృష్ణమ్మ పరవడులై
బాట రాయలసీమ పినాకిని వాహినై
తెలుగు హద్దులు వేరైనా తేజమొకటే
మనల బుద్ధులు వేరైనా మనమొకటే
తెలుగు వారలు ఎక్కడున్నను తీరు ఘనమై
ఉగాదివై ప్రమోదివై వినోదివై
గడపగడపకు తెలుగు పండగై
గుండె గుండెలోమమతల జిలుగై
మండే గుండెల ….
వసంతాలు పూయించమ్మా
బండ గుండెల……
అమృతాలు కురిపించమ్మా
శ్రీ శోభకృత్ ఉగాదివై తెలుగు నాట రావమ్మా.
శ్రీ శుభముల పండగై
వెలుగుల రావమ్మా
– రాఘవ మాష్టారు కేదారి
97414 07099