మనిషి సుగమ జీవిత గమనానికి మంచి అలవాట్లు చక్కని మార్గం చూపితే, శాస్త్రీయత బలం చేకూరుస్తుంది. మానవ జీవితం సైన్స్‌తో ముడిపడి ఉంటుంది. మనం లోతుగా పరిశీలిస్తే పండుగలను రూపొందించినవారు మనిషి మనుగడకు ఉపయుక్తమైన, శాస్త్రీయ ఉద్దేశాలతోనే ఏర్పరిచారని తెలుస్తుంది. శుచి శుభ్రతలు పాటించడం, ఆయా కాలాల్లో ప్రకృతి నుంచి లభించే ఆకులు, కాయలు, పండ్లూ, దినుసులు ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడటమే కాక, సంఘ జీవనాన్ని బలపరుస్తుంది.
మనిషి జీవితానికి, ప్రకృతికి అవినాభావ సంబం ధం ఉన్నది. ప్రకృతికి అనుగుణంగా నడుచుకుంటూ, ప్రకృతిని కాపాడుకుంటేనే మన జీవితంలో ఆనందోత్సాహాల సందడి ఉంటుంది. పంచభూతాలను సక్రమంగా వినియోగించుకుంటే ప్రమోదం, దుర్వినియోగపరిస్తే ప్రమాదం. మరి ప్రకృతి ఆరాధన పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న మన తెలంగాణలో గడపగడపనా జరుపుకొనే పండుగలన్నీ ప్రకృ తికి దగ్గరగా, అందరినీ కలుపుకొని, అందరితో కలిసిపోయి జరుపుకొనేవే. కాలాలకనుగుణంగా, పాడిపంటల దిగుబడులకు అనుకూలంగా ఉన్న రోజుల్లో ముఖ్యంగా కుటుంబ సభ్యులందరితో కలిసి పండుగలు జరుపుకొనే మహోన్నత సంప్రదాయం మనది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీరోజూ పండుగే అయినా ఒక్కో నెలలో ఒక్కో పండుగ మరింత ఘనంగా జరుపుకొంటారు. సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో వచ్చే బతుకమ్మ పండుగ నవరాత్రులపాటు పువ్వులే దైవంగా కొలిచే దేవతామూర్తి ఆరాధన జరుగుతుంది.
బతుకమ్మను పేర్చడంలో పోటీ పడేవారంతా పువ్వుల సేకరణ నుంచి నిమజ్జనం దాకా అందరూ, ఆరోగ్యం ఇచ్చే పూలు, చెట్లు మధ్య గడుపుతారు. బతుకమ్మలను హృదయానికి దగ్గరగా పెట్టుకొని నడుస్తారు. ఒక్కచోట పెట్టబడిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడి పాడుతారు. దానివల్ల పూలలోని ఔషధ గుణాలు శ్వాసను మెరుగుపరిచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
తంగేడు పూలు: బంగారం ఎంత విలువైందో అంతకన్నా విలువైందీ తంగేడు. బతుకమ్మ పేర్చడంలో తంగేడు పూలు లేకుంటే అసంపూర్ణమే. ఈ పూలే కాదు ఆకులు, కాండం, బెరడు అన్నీ ఆరోగ్యాన్నిచ్చేవే. మన తెలంగాణాలో కొండల ప్రాంతాల్లో బీడు భూముల్లో తంగేడు పూలు విరివిగా దొరుకుతాయి.
గునుగు పూలు: చేలల్లో ఎక్కువగా కనిపించే మొక్క గునుగు. ఇది గడ్డిజాతి మొక్క, గునుగు పూలను పసుపు, కుంకుమ వంటి రంగుల్లో ముంచి బతుకమ్మను అలంకరిస్తారు. మంచి యాంటిబయోటిక్.
బంతిపూలు: పసుపురంగులో గుమ్మాలకు, బతుకమ్మలను పేర్చడంలో కళను తెచ్చేపూలు ఇవి. దోమలను నివారించి అనారోగ్యాలను దూరం చేస్తాయి.
కట్లపూలు: ఈ పువ్వులు నీలిరంగులో ఉంటాయి. డయాబెటిక్, క్యాన్సర్‌ను తగ్గించే గుణాలు ఈ పువ్వుల్లో పుష్కలంగా ఉంటాయి.
తామర పూలు: బురదలో పుట్టినా అందం, స్వచ్ఛత దీని సొంతం. చర్మ సంబంధ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు.
గుమ్మడి పూలు: కూష్మాండ రూపిణీ గౌరమ్మగా కొలిచే సంప్రదాయం మనది. గుమ్మడి పువ్వు బతుకమ్మను పేర్చడంలో, ఆహార, ఔషధ రూపంలో తీసుకోవడమే కా క పాటలు చివరన -గుమ్మాడీ-అంటూ చేర్చి పాడటం మనకు గుమ్మడితో ఉన్న దగ్గరితనాన్ని తెలుపుతుంది.
ఇలా అన్నిరకాల పువ్వులతో తెలంగాణ ఆడపడుచుల చేతుల్లో అందంగా ముస్తాబవుతుంది బతుకమ్మ. బతుకమ్మ పండుగ మన ఆత్మగౌరవ ప్రతీక, తెలంగాణ నిషాణీ. రాష్ట్ర పండుగ.
పండుగలంటే పనీ-పాటా, ఆటా-ఆనందమే కాదు, ఆహారం-ఆరోగ్యం కూడా. మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు ఆయా కాలాలకనుగుణంగా ఆహారం తీసుకోవాలి. బతుకమ్మ సద్దుల కోసం తయారుచేసే ప్రతీ ధాన్యపు గింజా ఆరోగ్యాన్నిచ్చేదే. చక్కని ఆహారం తీసుకునేవారు, సామూహికంగా పండుగలు జరుపుకొనేవారు సంతోషకర జీవితం గడుపుతారు. బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొంటే చాలు హాయిగా నవ్వగలుగుతారు. ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో వారే కాక బయటివారూ మిత్రులవుతారు. పండుగలంటే ఒక సెలవురోజుగా భావించకుండా ఈ ఆధునిక పోటీ ప్రపంచంలో కొట్టుకుపోకుండా మన తెలంగాణ సంప్రదాయాల్లో ఇమిడి ఉన్న శాస్త్రీయతను గుర్తించి జీవితాలను ఆనందమయం చేసుకోవాలి.
బాలబోయిన రమాదేవి