తెలంగాణొచ్చింది.. తెల్లగోలుగా బతుకుతున్న. నేనొక్కన్నే కాదు.. నాతో పాటు రాష్ట్రంలున్న 23 వేల మంది కరెంటు కార్మికులు తెలంగాణొచ్చినంక తెల్లగోలుగ బతుకుతున్నరు. తెలంగాణ రాకముందు సిమ్మసీకట్ల మగ్గిన మా జీవితాలు ఇప్పుడు వెలిగిపోతున్నయి. 2017 జులై 29వ తారీఖు మా బతుకును మార్చిన రోజు. గడిసిన రోజులు ఇప్పుడు యాదికొస్తే గుడ్లళ్ల నీళ్లు తిరుగుతయి. గొడ్లను గోస వుచ్చుకున్నట్లు, కనీసం మనుషులనే కనికరం లేని కాంట్రాక్టర్లు పెట్టిన గోసను ఎట్లా మర్శిపోతం?
‘అరేయ్ అనిల్‌గా మనకు ఐదెకరాల భూమి. మాంచిగ ఎడ్లతోని ఎవుసం జేసుకుంట, ఉన్న భూమి దున్నుకొని బతుకుతె అయిపోయేదానికి ఎందుకురా ఆ కరెంటు పోళ్లెక్కుడు, ఆ కరెంటు తీగల పొంటి తిరుగుడు.. వద్దురా ఆ నౌకరి’ అని అమ్మ విజయ, ‘అన్నిరోజులు మనయే ఐతయా.. అసలే అది కరెంటు. గాషారం కమ్మయి దబ్బన షాక్ గొడ్తె మాడి మసిబొగ్గయితవురా వారి, వద్దు బిడ్డా మనకా నౌకరి’ అని బాపు నర్సయ్య.. ఒక్కతీర్గ మొత్తుకునుడు వద్దని. ‘ఆ సదువు పాడుగాను నాకేమో అబ్బకపాయె, అచ్చినకాడికి ఐటీఐ జేసి ఊకున్న. సరే.. ఈ ఎవుసం జేద్దామంటెనో నీళ్లక్కరువాయె.. అదీ మన బండలింగంపల్లిల నీళ్లు పుష్కలంగుంటయని ఎవుసం చెయ్యిమంటర్రా..? ఊరి పేరే బండలింగంపల్లి. ఊరు మొత్తం బండేనాయె.. ఆ వానల్ని నమ్ముకొని నాగలి వడ్తే ఇగ మన బతుకులు తెల్లారినట్లే’ అందుకని అమ్మాబాపు మొత్తుకోంగ గూడ వొయి ఓ కరెంటు కాంట్రాక్టర్ కింద చేరిన. రాన్రాను పర్మినెంట్ గూడ అయితదని ఆ కాంట్రాక్టర్ ఓ ముప్ఫై వేల కమిషనడిగితే గూడ ఇచ్చిన.
2007 ఆగస్టు ఒకటో తారీఖు.. ఆవునూర్ల ఉన్న 33/11కేవీ సబ్స్టేషన్ల ఆపరేటర్‌గా జేరిన. నెలకు 18 వందల జీతం. ఇట్లా చేరిన్నో లేదో.. ఆ సబ్స్టేషన్ల ఒగన్న కలిసిండు. అప్పటికే ఆరేండ్లాయెనట ఆయన ఆపరేటర్‌గా జేయవట్టి. ‘ఆ కాంట్రాక్టర్ గాడు ఇగ పర్మినెంటయితది, అగ పర్మినెంటయితదని ఊరియ్యవట్టి ఆరేండ్లాయె తమ్మీ, అదయ్యింది లేదు, పోయింది లేదు. ఈ జీతంతోని ఇళ్లెట్ల గడుస్తది.. అదీ నెలనెలా అస్తదనే గ్యారంటీ ఉండద’నుకుంటా మొకమంతా సిన్నగ చేసుకొని తన బాధనంతా ఎల్లవోసుకున్నడు. తుమ్మితే ఊసిపోయే నౌకరి కోసం ఇన్ని పాట్లా అనుకుంటా సబ్స్టేషన్లకెళ్లి ఔతల వడ్డడు.
ఇదిట్లా ఉంటే.. 2011ల సంగతి. ఎప్పట్లెక్కనే ఓ రోజు ఇంత సద్దిగట్టుకొని ఆవునూరు సబ్స్టేషన్లకు వోతున్న. నేను వొయ్యేసరికి అప్పటికే గుమిగూడి ఉన్నరు నాతోని పన్జేసేటోళ్లంతా. ఎమైందో ఏమోనని పరేషాన్ అయిన. మా సబ్స్టేషన్ల కాదు గని, ఎక్కన్నోనటా.. కాంట్రాక్టర్ కింద పన్జేసే నా అసొంటాయెనకు కరెంటు షాక్ గొడ్తే న్యాలకు సర్సిండట. అక్కడికక్కడే మనిషి మాడి నల్లకాకి అయినట్టయిండట.. వాళ్లు చెప్తా ఉంటే ఒక్కసారి అమ్మాబాపు గుర్తుకొచ్చిర్రు. వాళ్లు చెప్పిన మాటనన్న ఇనకపోతిని, ఉత్తగనన్న ఇన్లచ్చి పడ్తినని మస్తు బాధవడ్డ. బాధ అట్లుంటే జీతమేమన్న పెరిగిందా అంటే ఏడు వందలు వెర్గి ఇరువై ఐదు వందలైంది. జీవితం మొత్తం జేసినా నా జీతం 25 వేలు అయితదో లేదో అనుకున్న మనుసుల.
ఇగ మాకు జీతం ఇచ్చేది గవర్మెంట్ గాదు, ఓ కాంట్రాక్టర్. నా అసొంటోళ్లు ఆయ్న కింద ఎంత మందుంటరో లెక్కే లేదు. మా పేరు జెప్పుకొని గవర్మెంట్ దగ్గర ఎంత వసూలు జేసుకుంటడో ఏమో గని మమ్మల్ని మాత్రం అరిగోస వుచ్చుకుంటుండె. మూణ్నెళ్లకోసారైనా మాకు జీతం ఇచ్చేటందుకు ఆయ్నకు చేతులు రాకపోతుండె. మేమంతా గల్సి అప్పుడు రోడ్లమీదికొచ్చి ధర్నాలు చేస్తుంటే అకౌంట్ల ఏసుడు షురూ జేసిర్రు. అయినా మాకు ఆ కాంటాక్టర్ల శని వదలలేదు. నెలనెలా అకౌంట్ల జీతం వడ్డంక ఆ కాంట్రాక్టరుకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. లేకుంటే ఆయన వెట్టే గోస మామూలుగుండదు. ఓసారి ‘నా కట్టం పైసల్’ నీకెందుకియ్యాలె’ అని నాతోటి జేసేటాయెన మర్లవడ్డడు. అంతే ఆవునూర్లకెళ్లి తీసి ఎక్కడికో ఏసిండు. ఊర్లున్న కొలువు వొయ్యి ఎక్కన్నో వడ్డది. అన్నొద్దులు జేసిన నౌఖరి ఎట్లా వదిలేద్దాం.. దబ్బన పర్మినెంట్ అయితె నోటికాడి బుక్క కింద వడ్డట్టయితదని నోర్మూసుకొని వోయిండు మా దోస్తు. సబ్స్టేషన్ల పన్జేసే కాంట్రాక్టు జీతగాళ్లంతా నెలకో వెయ్యి సొప్పున ఇస్తే ఎవర్ని ఒక్కమాట గూడ అనేటోడు గాదు. లోపలెంత కలకలమన్నా.. నెలచ్చేసరికి ఇంత వాని మొకాన కొట్టేటోళ్లం.
2014 జూన్ 2.. తెలంగాణొచ్చింది. కాంట్రాక్టర్లు వెట్టే బాదనంత ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌కు చెప్పుకొన్నం. సారు దయతల్సిండు. సీఎండీలు ప్రభాకర్‌రావు, గోపాల్‌రావు సార్లు 2017 జులై 29 రోజున ఆర్టిజన్-గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3, గ్రేడ్-4 కింద ఒక్కసారే 23 వేల మందిని పర్మినెంట్ చేసిర్రు. ఇప్పుడు నెలకు ఇరువై ఐదు వేల జీతం అస్తున్నది. అన్నింటికన్న ముఖ్యంగా చేస్తున్న కొలువుకు నిలకడ ఏర్పడ్డది. తుమ్మితే ఏడూసిపోతదోనన్న బెంగ అస్సల్కే లేదు.
ఇప్పుడు ఆసిఫ్‌నగర్ సబ్స్టేషన్ల పన్జేస్తున్న. పెండ్లాం ఇద్దరు పిల్లలతో సంబురంగ బతుకుతున్న. ఇగ అమ్మాబాపు విషయానికొస్తే.. నాడు బీడున్న ఐదెకురాల భూమిల ప్రభుత్వం ఇచ్చే ‘రైతుబంధు’ పెట్టువడి పైసలతోని ఎవుసం చేస్తున్నరు. పేరుకు మా ఊరి పేరు బండలింగంపల్లే అయినా ఇప్పుడు ఆ బండ మీద గూడ నీళ్లూరుతున్నయి.
గడ్డం సతీష్,
959059041