అనాదిగా నిన్ను మేము చూస్తూనే ఉన్నాం. నిన్ను మా మేనమామగా ఆదరించి మా పిల్లలకు చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూనే ఉన్నాం. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే అంటూ అన్నమయ్య సంగీతాన్ని ఆరాధనగా నీకు ఎన్నో ఏండ్లుగా వినిపిస్తూనే ఉన్నాం. ఇప్పుడిక మామ బంధాన్ని బలోపేతం చేస్తూ మా శాస్త్రవేత్తలు ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో సాంకేతిక ప్రేమలేఖను రోవర్ల మధ్య చంద్రయాన్-3లో కూర్చి నీకు రాకెట్ ద్వారా పంపించారు కదా.. అందుకున్నావా మరి!? నిన్ను మనసుకు అధిపతి అంటారు కదా.. నీకు ఇలాంటివి మరింత ఆనందం కదా!
నాలుగేండ్ల క్రితం నిన్ను చేరటంలో ఓడిపోయినా ‘విక్రమ’ పరాక్రమంతో దిగ్విజయం సాధించి భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించే అవకాశం నువ్వే మాకు కల్పించావు. భూమిపై ఆవల స్థిరమైన నివాసం కోసం కలలుకంటున్న మానవాళి కలల్ని ఇక సాకారం చేస్తావు కదా! మా చంద్రయాన్-3లోని విక్రమ్, ప్రగ్యాన్ జీవిత కాలం 14 రోజులేనని తెలిసి ఎంత భయపడ్డానో. ఇస్రో అధినేత సోమనాథే కాదు భారతీయులంతా నీ వైపు ఆశగా చూశారు. ఈసారైనా చందమామను దగ్గరగా చూద్దామని ఆకాంక్షిస్తున్నారు. అయినా రూ.600 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు మాత్రమే చేశామనుకుంటున్నావా? దాంట్లో మా ఆశలన్నీ కూర్చి ఉన్నాయి సుమా!
అవును మామా! ఆకాశం ఓ ప్రహేళిక -విశ్వం విస్మయాల పుట్ట అంటున్నారు. అసలు నువ్వెలా ఉంటావ్? తెల్లదనాల చందమామవి..ఆనందాలు పంచే మేనమామవి. మరి నీకు దూరంగా మమ్మల్ని ఇంకా ఉంచటం నీకు భావ్యమా చెప్పు! అప్పుడెప్పుడో 60 ఏండ్ల క్రితం నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మొదలు ఇప్పటివరకు కేవలం 12 మంది మాత్రమే నీ మీద కాలు మోపారట. నువ్వింకా మమ్మల్ని పెద్దమ్మ బువ్వ పాత్రలోనే ఉంచితే ఎలా మామయ్య!
ఓ చంద మామయ్య! నువ్వంటే కవులకు ఎంతో ప్రేమ కదా! శ్రీరాముడు అన్నం తినకుండా మారాం చేస్తుంటే అద్దంలో నీ ప్రతిబింబం చూపించారని అప్పటి నుండి ఆయన పేరులో నీ పేరు చేరిందని మేం వినే జానపద కథలు నీ గురించే కదా! ఎవరు అందంగా కనిపించినా ఆహా ఏమి వర్చస్సు.. చంద్రకళ ఉట్టి పడుతుంది అంటూ అక్కడా నీకే జోడి పెట్టడం మనుషులకి బాగా అలవాటయింది. కాస్త మనుషుల్ని దయతో కనికరించి నీతో జతగా జీవించే భాగ్యం కలగనిస్తావా మామ!
మామ నీ మీద అడుగు పెట్టామన్న పేరే కానీ నీ అంతరంగాన్ని కానీ, నీ విశేషాలు కానీ తెలుసుకోలేకపోయాం. నీ గురించి మాకు తెలిసింది ఎంతో తక్కువ. కానీ వరుసగా మూడు చంద్రయాన్ ప్రయోగాలు చేసి మా ప్రయత్నానికి నీళ్లు వదల్లేదు.. విక్రమ్ నీ మీద స్మూత్గానే కదా ల్యాండ్ అయింది. ఇది మా స్వీయ పరిజ్ఞానంతో తయారు చేసిన సాంకేతిక విప్లవం. సున్నితంగా నీ మీద దిగిన దేశంగా చరిత్ర సృష్టించి కొత్త రికార్డు నమోదు చేశాం.
ఒక వ్యోమ నౌకని ఒక నిర్దిష్ట మార్గంలోకి మళ్లిస్తూ అంతే కచ్చితంగా పనిచేసేలా చేయడం అన్ని వ్యవస్థల మధ్య సమన్వయం కాపాడుకోవడం గొప్ప విషయంగా చూడు. చంద్రయాన్ విజయవంతం కావాలని 140 కోట్ల మంది ప్రార్థనలు చేశాం కదా. అయినా మామ అర్బిటర్ ఏడాదిపాటే పనిచేస్తుందట. కానీ ల్యాండర్, రోవర్ల పనికాలం 14 రోజులే అట. సౌరశక్తితో మాత్రమే పని చేస్తాయి కాబట్టి 14 రోజుల పగటి కాలాన్ని మాత్రమే మేము పరిగణనలోకి తీసుకున్నాం. నీ మీద రాత్రులు ఎలా ఉంటాయో మాకు తెలియదు కాబట్టి అంతా నీ మీదే భారం వేశాం. నీ దగ్గరికి పరిగెత్తుకు రావాలన్న మా తపనని, ప్రేమని అర్థం చేసుకొని మాకు సహకరించినందుకు ధన్యవాదాలు మామా.
నువ్వు బండెక్కి వస్తావని… బంతి పూలు తెస్తావని.. తేరు మీద వస్తావని.. తేనెపట్టు తెస్తావని.. పడవ మీద వస్తావని ..పాలు పెరుగు తెస్తావని చిన్నప్పటినుండి ఎదురుచూసి చూసీ పాటలు పాడి ఇక ఇప్పుడు మేము నిన్ను చేరుకున్నాము. మా ఆశల్ని సాకారం చెయ్యి. మా చంద్రయాన్-3 నడతను మానవాళికి శ్రేయోదాయకం చెయ్యి.
ఇట్లు భారతీయులు
ఇదిగో మామయ్య! నీ మీద నీళ్లు ఉన్నాయని కనిపెట్టింది మేమేగా! ఇప్పుడు నీవు ఆవాసయోగ్యమో కాదో చూడాలని తపిస్తున్నది మేమే. మూడు లక్షలకుపైగా కిలోమీటర్ల దూరంలో ఉన్న నీ దగ్గరికి వ్యోమ నౌకని స్వదేశీ పరిజ్ఞానంతో నీపై దింపిన నీ బిడ్డలం మేమే. మబ్బులు చీల్చుకుంటూ పైకి లేచిన ల్యాండర్, రోవర్లు నీ రహస్యాలను మాకు చేరవేస్తాయిలే! ఐనా మామ.. నీకు మాకు మధ్య ఈ దాగుడుమూతలు ఇంకా ఎన్నాళ్లు? త్వరలో ఇద్దరం కలిసి ఆడుకునే సందర్భం దగ్గర్లోనే ఉండేలా చూడు సుమా!