సామాన్యుడి మాట
అమ్మనాయినల మొకం ఎట్లుంటదో గూడ నాకు తెల్వద్, అనాథనన్న మాట. యాకుత్‌పురా హాస్టలే నా ఇల్లు. నాతో ఉండే నలుగురు దోస్తులే నా లోకం. మాతం (మొహర్రం) పండుగ మంచిగ జర్గుతదని తెలిస్తే దోస్తులతోని గల్సి సూడనీకి చార్మినార్ దిక్కు వోయినం. మా లెక్కనే సూడనీకి వచ్చినోళ్లు మస్తుమందే ఉన్నరు. ఆ మందిల నలుగురం నపరో దిక్కయినం. హాస్టల్ తొవ్వ తెల్వక నేను కాటగల్సిన.
***
ఆనాటి నుంచి నావోళ్లనుకున్న ఆ నలుగురు దోస్తుల్గూడ నాకు లేకుంటయిర్రు. నాకు నాలుగేండ్లుంటయి గావొచ్చు. సడుగుపొంటి ఏడ్సుకుంటా వోతే దిల్సుఖ్నగరొచ్చింది. ఆ రాత్రి వెంకటాద్రి టాకీస్ గోడలే నాకు నీడనిచ్చినయి. తెల్లారి పదకొండు గొడ్తున్నది. కడుపుల పేగులు గుర్రుమంటున్నయి. వెంకటాద్రి దగ్గర్నే గుండ్రటి టోపీ పెట్టుకున్న ఓ పెద్దమనిషి పండ్లమ్ముతున్నడు. నా ఆకలి ఆయనకెట్లెర్కయిందో, ఏమో.. ‘ఇదర్ ఆవో బేటా..’ అని పిల్సి మరీ సేపుల్ని కరాబైన దిక్కు కోసిపడేసిండు. మంచిగున్నయి నా చేతిల వెట్టిండు. ఆ రోజుకు ఓ పూటగడ్సింది. రెండు, మూడ్రోజులకు ఎవ్వలో అధికారులు, పోలీసోళ్లొచ్చి తీస్కపోయిర్రు.
***
సీన్ కట్‌చేస్తే.. ఏదో అనాథాశ్రమం. ఏడో తర్గతి దాన్క ఆడనే సదువుకున్న. అది చిన్నపోరగాళ్లుండే హాస్టల్. ఎనిమిదో తర్గతినుంచి అక్కడుండుడు కల్వదని ఆశ్రమం సార్లు వేరేకాడికి పంపిర్రు. కతం సదువు ఆడికే బంద్. నేనున్న హాస్టల్ల లంగలు, దొంగలు అందరుంటరు. ఆ రోజుల్ల ఐదు రూపాలుంటే మా గొప్ప. రోజుకు ఐదిస్తనే ఆ హాస్టల్ల తిండివెడ్తరు మరి. అందుకే పొద్దుగాళ్ల లేస్తెనే ఎవ్వలపనికి ఆళ్లు వోయేటోళ్లం. నేన్గూడ చెత్తేరే పనికి కుదిరిన. నెక్లెస్‌రోడ్డు నుంచి ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్ మొత్తం నాదే. పైసల మీద పాయిరం జూపేటోళ్లను జూసి నేన్గూడ అప్పుడప్పుడే తప్పటడుగులేస్తున్న. నన్ను మస్తురోజుల నుంచి గమనిస్తున్న కృష్ణన్న (హిజ్రా) మంచిమాటలు జెప్పిండు. కృష్ణన్న మాటలే ఏది మంచో, ఏది చెడో ఎర్కజేసినయి.
ఓ రోజు.. కొత్తగ్గడ్తున్న అంబేద్కర్ సచివాలయం రోడ్డుకు ఓ ముగ్గుర్నలుగురం గూసు న్నం. జీబులోంచి ఓ పోలీసాయన దిగి ‘అరే య్.. ఓ శవాన్ని వట్టాలి’ నలుగురు మన్షులు రార్రని వట్కపోయిర్రు. దాంట్ల నేన్గూడున్న. ఆ శవం ఎక్కడుందంటే ట్యాంక్‌బండ్ చెర్వు దగ్గరున్న రాములోరి గుడెన్క. దాన్ని సూడంగనే నాతోనొచ్చినొళ్లు ‘మాకు ఈత రాదు సార్’ అని తప్పించుకున్నరు. ఆ శవం అట్లున్నది మరి ముక్కు బెదిరిపోయేంత వాసనవట్టి. ‘నేన్ దిగుత సార్, నాకు ఫుల్లు ఈతొచ్చు’ అంటే.. ఆ ఏఎస్సై సారేమో.. ‘నువ్వు సిన్న పోరనివిరా బై’ పుసుక్కున నువ్వుగూడ అటే వోతే మాకెందుకచ్చిన పరేషాన్’ అని అద్దంటే అద్దనుడు వెట్టిండు. ‘సార్ నా మీద నమ్మకం లేకుంటే ముందుగాల్ల కడకు గొడ్త, మీరు వొమ్మంటనే శవం కాడికి వోత, లేకుంటే లేద్’ అని ముందుగాల్ల హుస్సేన్‌సాగర్‌ల కడకు ఈతగొట్టి సూపెట్టిన. అప్పుడు పోలీసోళ్లకు నమ్మకమొచ్చి తీస్కరాపోరా అని శవం కాడికి తోలిర్రు.
మనిషితోని మూడింతలున్న శవాన్ని ఎటుగుంజినా మాంసం ఊడొస్తున్నది. అటో ఇటో తన్లాడి ఆ శవాన్ని గడ్డకిగ్గుకొచ్చిన. నన్ను వద్దన్న ఏఎస్సై సారుతోనే ‘శభాష్’ అనిపిచ్చుకున్న. అప్పట్నుంచి ట్యాంక్‌బండ్ మీదున్న కట్టమైసమ్మ గుడే నా ఇల్లు. నాకు తిండివెట్టింది రామకృష్ణ మఠమే. ఇప్పటిదాన్క ఓ 125 మందిని కాపాడిన. వేల శవాలను గడ్డకిగ్గుకొచ్చిన. నా సేవను గుర్తించి నాకు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది.
***
నా పెండ్లాం శాంత. గూడ ఈత గొడ్తది. మూణ్నెల్ల కింద ఎర్కలేని మనిషి హుస్సేన్‌సాగర్‌ల దున్కిండట. శాంత ఆయనెంబటే దున్కి గడ్డకిగ్గుకొచ్చింది. ఆమె గూడ ఓ 25 మందిని కాపాడింది. మాకు తొల్సూరు కాన్పుల అముడాలోల్లు వుట్టిర్రు. తర్వాత ఏడాదికొగలు మొత్తం ఏడుగురు పిల్లలు. ముగ్గురు మొగ పోరగాళ్లు గురుకులాల హాస్టళ్లుంటరు. ముగ్గురాడివిల్లలు అనాథాశ్రమంల ఉంటరు. ఇగ సిన్నోడు, నేను, శాంత కట్టమైసమ్మ కాన్నే ఉంటం.
***
దోమనక, దుమ్మనక కట్టమీన్నే దమ్ము తీస్కునేటోళ్లం. నాకు అడ్రస్ గినా ఏం లేదు. ట్యాంక్‌బండే నా ఇల్లు. నా కట్టం కేటీఆర్ సార్ కండ్లకు కనవడ్డట్టుంది. సారుది మంచి మనుసు కావట్టే రోడ్డు మీదున్న నన్ను ఓ ఇం టోన్‌ని జేసిండు. ఇప్పుడు నా అడ్రస్ డాక్టర్ శివ, ‘బీ బ్లాక్, 112’, అంబేద్కర్‌నగర్, నెక్లెస్‌రోడ్ అని గల్లెగిరేసి జెప్పుకుంట. నా కలలగూడ హైదరాబాద్‌ల గజం భూమి కొంటనని ఊహించలే. అసొంటిది నాకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చి నన్నూ, నా కుటుంబాన్ని కాపాడిండు కేటీఆర్ సార్. ఇప్పటికైతే ఇల్లు పత్రాలందినయి గాని, ఈ నెల 26న కేటీఆర్ సార్తోని గల్సి ఇండ్లల్లకు వోతున్నం. నన్నాదుకున్న తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్, కేటీఆర్ సార్లకు శతకోటి శనార్తులు.
– గడ్డం సతీష్, 99590 59041