నీట్‌పై నీలినీడలు
వైద్య కళాశాలలో ప్రవేశాలకు పోటీ అధికంగా ఉంటుంది. సీట్లు తక్కువగా ఉండటం, అభ్యర్థులు లెక్కకు మిక్కిలిగా ఉండటమే అందుకు కారణం. దాంతో సహజంగానే కఠినమైన ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
వైద్య కళాశాలలో ప్రవేశాలకు పోటీ అధికంగా ఉంటుంది. సీట్లు తక్కువగా ఉండటం, అభ్యర్థులు లెక్కకు మిక్కిలిగా ఉండటమే అందుకు కారణం. దాంతో సహజంగానే కఠినమైన ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలల ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ కేంద్రం 2017లో నీట్ పరీక్షను ప్రవేశపెట్టింది. రాష్ర్టాల ఆధ్వర్యంలో జరిగే ప్రవేశాలను కేంద్రం జాతీయ పరీక్ష పేరిట తన గుప్పిట్లోకి తీసుకున్నది. వికేంద్రీకృత పద్ధతిలో ఉండే లొసుగుల తొలగింపు, పకడ్బందీ నిర్వహణ అనే బృహత్తరమైన లక్ష్యాన్ని కేంద్రం టాంటాం వేసుకున్నది. వాస్తవానికి అదంతా డొల్లేనని తాజా ఫలితాలపై చెలరేగిన దుమారం తేటతెల్లం చేసింది. నీట్ అనేది ఓ అవకతవకల పుట్టగా మారిందని రోజురోజుకు వెలుగుచూస్తున్న అక్రమాలు సూచిస్తున్నాయి. పేపర్ లీకులు, గ్రేస్ మార్కుల వంటి పరీక్షా నిర్వహణ లోపాలకు తోడుగా పరీక్షా కేంద్రా ల్లో అక్రమాలు జరిగినట్టు తెలుస్తున్నది.
లక్షలమంది అభ్యర్థులు కోటి ఆశలతో రాసే పరీక్ష నిర్వహణ ఓ ప్రహసనంలా మారింది. ఈసారి 67 మంది అభ్యర్థులకు ప్రథమ ర్యాంకు రావడం నీట్ ప్రహసనంలో హైలైట్. అలాగే సుమారు 1563 మంది విద్యార్థులకు ‘సమయాభావమైందని’ అంటూ గ్రేస్ మార్కులు కలపడం నీట్ లీలలకు పరాకాష్ఠ. ఈ గ్రేస్ మార్కులు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం అసమర్థ నిర్వహణకు చెంపపెట్టు లాంటిది. నీట్ అక్రమాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘అక్రమాలు జరిగిన మాట వాస్తవమే.. బాధ్యులపై చర్య తీసుకుంటాం’ అనే రొటీన్ ప్రకటనతో చేతులు దులుపుకొన్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే)ని కేంద్రంలోని పాలక బీజేపీ ‘అస్మదీయుల’తో నింపేసిందనే ఆరోపణలున్నాయి. ప్రస్తుత వివాదంలో ఎన్టీయే డైరెక్టర్ హాస్యాస్పదమైన రీతిలో ఇస్తున్న డొంకతిరుగుడు సమాధానాలు విస్మయం కలిగిస్తున్నాయి. నీట్లో కేంద్రమంత్రుల జోక్యం ఎన్టీయే స్వయంప్రతిపత్తిని నీరుగారుస్తున్నదనే ఆరోపణలూ వినవస్తున్నాయి.
ఎన్టీయే వేసిందీ బీజేపీ ప్రభుత్వమే. అక్రమాలకు బాధ్యత కూడా వారిదే. ఇప్పుడు ‘నేరస్థులపై’ చర్యలు తీసుకుంటామని అంటున్నదీ వారే. లీకైన పేపర్లకు లక్షల్లో బేరాలు పెడుతున్న అక్రమార్కులు వ్యవస్థలోని పెద్దల అండదండలు లేకుండానే రెచ్చిపోయి ఉంటారా? బీహార్, రాజస్థాన్‌తో పాటుగా ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లో నీట్ అక్రమార్కులు అరెస్టు కావడం దేనిని సూచిస్తున్నది? ‘పరీక్షా పే చర్చా’ అంటూ ఊదరగొట్టిన ప్రధాని మోదీ, టీఎస్పీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ నాడు చెలరేగిపోయిన బీజేపీ నాయకులు ఇప్పుడు నీట్ వివాదంపై మౌనం వహిస్తున్నారు. నీట్ పరీక్షపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నమ్మకం పూర్తిగా అడుగంటింది. నిప్పులాంటి నిష్పాక్షికతకు నిలువెత్తు దర్పణంలా నిలవాల్సిన పరీక్ష డబ్బులు వెదజల్లి సీట్లు పొందాలనుకునేవారికి ఆటస్థలమైంది. బ్రోకర్లు, ఏజెంట్లకు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారిపోయింది. పేదింటి బిడ్డలకు మెడికల్ సీటు అందని పండులా తయారైంది. నిలువెల్లా కుళ్లిపోయి కంపుకొడుతున్న నీట్ పరీక్షా విధానాన్ని సమూలంగా సమీక్షించాల్సిన అవసరం ఉన్నది. అంతకన్నా ముందు అక్రమాలకు బాధ్యులను పట్టుకుని శిక్షించాల్సిన అవసరముంది. అందుకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించడం ఒక్కటే మార్గం.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

