తిరుమల : తిరుమల ( Tirumala) శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ( Pavitrotsavams ) ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు.
హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ట జరిగింది. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.