విశ్వాసం గుండెకు బలాన్నిస్తుంది. నమాజ్ మనసుకు శాంతినిస్తుంది. జకాత్ చేతికి దాతృత్వాన్ని నేర్పుతుంది. ఉపవాసం ఆత్మకు నిగ్రహాన్ని ఇస్తుంది. హజ్ జీవితానికి వినమ్రతను నేర్పుతుంది. ఈ ఐదు స్తంభాలు మతపరమైన ఆచారాలు కావు, అవి ఒక మనిషిని సంపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దే మూలసూత్రాలు. పునాది బలంగా ఉన్న ఇల్లు గాలివానలకు చెదరనట్టే, ఈ ఐదు విలువలపై నిర్మితమైన కుటుంబం జీవితంలోని ఏ కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కోగలదు. అది కేవలం ఒక ఇల్లు కాదు, అది పరలోకపు వెలుగుల ప్రతిరూపం.
తెల్లవారుజామున మంచు తెరలను చీల్చుకుంటూ వినిపించే ‘అజాన్’ పిలుపుతో ఆ ఇంట్లో జీవం మొదలవుతుంది. ఇంటి పెద్ద చేసే ‘వుజూ’ నీళ్ల గలగలలు, పిల్లల కళ్లలో మెదిలే నిద్రమత్తును తరిమేస్తాయి. అమ్మ నిశ్శబ్దంగా ముసల్లా (నమాజ్ మత్తు) పరుస్తుంటే, ఆ చిన్న గది ఒక ప్రార్థనా మందిరంగా మారిపోతుంది. ఇది కేవలం ఒక ఉదయం కాదు.. ఒక సంస్కృతి, ఒక జీవనశైలి. ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన ఐదు స్తంభాలు ఆ ఇంటికి గోడలు మాత్రమే కాదు, ఆ కుటుంబం నడిచే ధర్మ మార్గాలు.
1. షహాదా: ఆత్మవిశ్వాసపు తొలి అడుగు
అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు లేడు; ఈ పదాలు ఆ ఇంట్లో కేవలం గోడల మీద అలంకరణలు కావు, అవి ఆ కుటుంబపు గుండె చప్పుడు.
జీవన పాఠం: కష్టమొచ్చినా, కన్నీరొచ్చినా ‘మనకు తోడుగా అల్లాహ్ ఉన్నాడు’ అని అమ్మ పిల్లలకు చెప్పే మాట వారిలో కొండంత ధైర్యాన్ని నింపుతుంది. ఈ ఏకేశ్వరోపాసన వారిని భయం నుంచి విముక్తులను చేసి, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది.
2. సలాహ్: రోజును శాంతితో ముడివేసే వంతెన
ఐదు పూటల నమాజ్ అంటే ఐదుసార్లు దైవంతో జరిపే ఆత్మీయ సంభాషణ. క్రమశిక్షణ: ఉదయం ‘ఫజ్’్రతో మొదలై రాత్రి ‘ఇషా’తో ముగిసే ఈ ప్రయాణంలో నమాజ్ ఒక గడియారంలా పనిచేస్తుంది.
ప్రశాంతత: ప్రపంచపు ఉరుకులు పరుగుల మధ్య, నుదురు నేలకు ఆనించి ‘సజ్దా’ చేసినప్పుడు ఆ కుటుంబానికి లభించే మానసిక శాంతి అమూల్యమైనది. ‘నమాజ్ మనిషిని చెడు నుంచి రక్షిస్తుంది‘ అన్న ఖురాన్ వాక్యం ఆ ఇంటి నైతిక విలువలకు రక్షణ కవచం.
3. జకాత్: కరుణ కలిగిన సంపద
పండుగ పూట కొత్త దుస్తుల సంబురంలో ఉన్న పిల్లలకు, తండ్రి ఒక కవర్లో కొంత డబ్బు తీసి పక్కన పెడుతూ జకాత్ ప్రాముఖ్యాన్ని వివరించాలి.
త్యాగం: సంపాదనలో 2.5 శాతం వెనకాడకుండా పేదలకు ఇవ్వడం అంటే, అది కేవలం లెక్క కాదు.. అది ఒక సామాజిక బాధ్యత.
పాఠం: ‘మనం తినే ఆహారంలో పక్కవాని వాటా కూడా ఉంది’ అని పిల్లలు నేర్చుకున్నప్పుడే స్వార్థం అనే చీకటి ఆ ఇల్లు వదిలిపోతుంది.
4. సౌమ్: ఆత్మను శుద్ధి చేసే రంజాన్
రంజాన్ నెల వస్తే ఆ ఇల్లు క్రమశిక్షణకు ఆలయంగా మారుతుంది. ఆకలిని భరించడం అంటే కడుపును ఖాళీగా ఉంచడం కాదు, కళ్లను, మాటను, ఆలోచనలను పవిత్రంగా ఉంచుకోవడం.
సహనం: ఎర్రటి ఎండలో దాహాన్ని తట్టుకుంటూ ఎదురుచూసే ‘ఇఫ్తార్’ సమయం, జీవితంలో ఓర్పు ఎంత ముఖ్యమో నేర్పుతుంది. అందరూ కలిసి ఒకే కంచం ముందు కూర్చుని ప్రార్థించే ఆ క్షణాలు కుటుంబ బంధాన్ని మరింత బలపరుస్తాయి.
5. హజ్: మానవత్వపు మహా సంగమం
ఎప్పటికైనా ‘కాబా’ గృహాన్ని దర్శించుకోవాలనే కోరిక ఆ తల్లిదండ్రుల కళ్లలో నిరంతరం మెరుస్తూనే ఉంటుంది.
సమానత్వం: హజ్ యాత్రలో రాజు, పేద అనే తేడా లేకుండా అందరూ ఒకే తెల్లని వస్త్రంలో (ఇహ్రామ్) నిలబడతారు. ఈ దృశ్యం పిల్లలకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. దేవుని ముందు అందరూ సమానమే. వినమ్రత, అణకువ అనేవి ఈ యాత్ర అందించే గొప్ప బహుమతులు.