బైబిల్లో దేవుని కృప, దైవ కారుణ్యం, దేవుని కనికరం, దేవుని దయ అనే పదాలు తరచుగా వినబడతాయి. వాస్తవానికి ఈ నాలుగూ దేవుని ప్రేమకు రూపాలు. వేదాంత పరంగా దైవశాస్త్ర పరంగా మరింత తేడాలు కనిపిస్తాయి. అర్హతలేని మనిషికి దేవుడు ఉచితంగా ప్రసాదించే రక్షణ వరమే కృప అంటారు. మనం సంపాదించేది కనికరం. మన పాపాలకు రావలసిన శిక్షను దేవుడు ఆపివేయడమే కనికరం. అంటే, పాపిపై తీర్పునకు బదులుగా క్షమను చూపడం. ఇక దయ అంటే దేవుడి విడువని, నమ్మకమైన ప్రేమ దయ. మన బలహీనతల మధ్య కూడా ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మేలుచేస్తూనే ఉంటాడు. యెహోవా దయ నిరంతరం ఉండును (కీర్తన 100:5). కారుణ్యం అంటే ఇతరుల బాధను చూసి హృదయం లోపల కదిలిపోవడం.
ఈ గుణాలన్నీ ఆదాము మొదలుకొని క్రీస్తు వచ్చేంత వరకూ ఆయా భక్తుల పట్ల, ప్రవక్తల పట్ల తాను ఎన్నుకున్న ప్రజానీకం పట్ల దేవుడు ప్రదర్శించాడు. అదే గాక, అనంతరం క్రీస్తు వచ్చిన తర్వాత మరింత రెట్టింపుతో అవన్నీ ఆయా అమాయక ప్రజానికం పట్ల ప్రదర్శనీయమయ్యాయి. ఈ నాలుగు గుణాలూ దేవుడికి మానవులపై గల ప్రేమ వల్ల మాత్రమే ఆయా సందర్భాల్లో కనిపిస్తాయి. దైవ ప్రేమ సూత్రం ఈ నాలుగు గుణాలకూ మూలం. క్రైస్తవులు దేవుడు చూపిన ఈ గుణాల్ని తమలోని ప్రేమ సూత్రంతో సాటి మనిషిపై ప్రదర్శించి తమ క్రైస్తవ తత్వాన్ని చాటిచెప్పాలి.
డా॥ యం.సోహినిబెర్నార్డ్
98667 55024