స్త్రీ.. సృష్టికి మూలం. కానీ ఒకప్పుడు ఆమె అస్తిత్వమే ఒక ప్రశ్నార్థకం. పుట్టకముందే సమాధి అయ్యే స్థితి నుంచి, నేడు ఆకాశమే హద్దుగా ఎదిగే వరకు ఆమె ప్రయాణం వెనుక ఒక గొప్ప సంస్కరణ ఉంది. 1400 ఏళ్ల క్రితమే ఇస్లాం మహిళకు అందించిన హక్కులు, గౌరవం నేటికీ ఆదర్శనీయం. చరిత్ర పుటలను ఒక్కసారి తిరగేస్తే.. ఇస్లాం పూర్వ కాలంలో మహిళల స్థితి అత్యంత దయనీయంగా ఉండేది. ఆడపిల్ల పుట్టడమే అవమానంగా భావించి, పసిగుడ్డును ప్రాణంతో ఉండగానే సమాధి చేసే అనాగరిక కాలమది. అటువంటి చీకటి రోజుల్లో ప్రవక్త ముహమ్మద్ (స) మహిళా హక్కుల గళాన్ని వినిపించారు.
ఆడపిల్లల హత్యను నిషేధించడమే కాదు, కుమార్తె పుడితే సంతోషంగా ఆహ్వానించడం ఒక పుణ్యకార్యమని చాటిచెప్పారు. ఆమె.. ఆస్తికి యజమాని మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ లేని రోజుల్లోనే ఇస్లాం వారికి వారసత్వ హక్కును కల్పించింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. వారసత్వంలో పురుషుడికి వచ్చే వాటాలో అతను తన తల్లి, భార్య, పిల్లల బాధ్యతలను చూడాలి. కానీ, మహిళకు వచ్చే వాటా కేవలం ఆమె వ్యక్తిగతం. తన సొమ్మును ఎలా ఖర్చు చేయాలనేది ఆమె ఇష్టం. అంటే, అల్లాహ్ ఆమెపై ఎలాంటి ఆర్థిక భారాన్ని మోపకుండానే, ఆమెను ఆస్తిపరురాలిని చేశాడు.
దైవ ప్రార్థనలో కానీ, ఆధ్యాత్మిక ఉన్నతిలో కానీ స్త్రీ, పురుష భేదం లేదు. పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే వారి కంటే మిన్నగా ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించే అవకాశం మహిళలకు ఉంది. సృష్టికర్త దృష్టిలో భక్తికి మాత్రమే ప్రాధాన్యం తప్ప లింగ భేదానికి కాదు.
మహిళ అంటే కేవలం ఒక శరీరం కాదు, ఆమె ఒక శక్తి. ఆమెలోని భావోద్వేగాలను, శారీరక త్యాగాలను (మాతృత్వం వంటివి) గుర్తించి గౌరవించడమే అసలైన మానవత్వం. ఆ గౌరవాన్ని కాపాడుదాం.. ఆమె ఎదుగుదలకు తోడ్పడుదాం.
..?ముహమ్మద్ ముజాహిద్, 96406 22076