మరో జన్మ అనే మాటకు పునర్జన్మ అని కాదు అర్థం. ఈ జన్మలోనే మరోసారి పుట్టడం. ఓ సారి పుట్టిన వాడు తిరిగి జన్మించడం అనేది తల్లి గర్భంలో కూడా సాధ్యపడదు. కానీ బైబిల్లో వినిపించే ఈ మాటకు వేరే అర్థం ప్రతిధ్వనిస్తుంటుంది. అపోస్తులుడైన పౌలు దగ్గర్నుంచి కోటాను కోట్ల మంది మరోసారి జన్మించి అధ్యాత్మికంగా సంచలన చరిత్ర సృష్టించిన వారే. మనసు మార్చుకొని కొత్త సత్ప్రవర్తనకు పరిణామం చెందడమే ఈ మరోసారి జన్మించడం.
ప్రభువు కోరేది ప్రవర్తనలో సమూలకమైన పరివర్తన మాత్రమే. పాత జీవితానికి స్వస్తి చెప్పి తిరిగి కొత్త జీవితం వైపు లక్ష్యం మళ్లించడం. ‘నేను దప్పిగల వానిమీద నీళ్లను, ఎండిన భూమిమీద ప్రవాహ జలములను కుమ్మరించెదను.
నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు’ (యెషయా 44:3,4) అని సెలవిచ్చాడు ప్రభువు. ఎందుకూ పనికిరారని అనుకునే వ్యక్తులను దేవుడు మార్చి, వారి ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేయించిన ఉదంతాలెన్నో మనకు కనిపిస్తాయి. అలా మార్పు చెందిన జీవితాలెన్నో చైతన్యానికీ, సంచలనాలకూ సాక్షిగా చరిత్రలో మిగిలిపోయాయి.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024