సూర్యుడి కథ
శాస్త్రీయాంశాలను కథలుగా చెప్పడం మన వారికి వెన్నతో పెట్టిన విద్య. పదాలు సాంకేతికంగాను, సూచనప్రాయంగాను ఉంటాయి. పట్టుకొని తెలుసుకుంటే విజ్ఞానం. పట్టుకోలేకపోతే మానసికోల్లాసాన్ని కలిగించే కథను వింటాం. ఏ విధంగా చూసినా సమయం వృథా కాదు.
‘లోకాలకు వెలుగునిచ్చే పెద్ద కొలువులో వున్నాడు కదా’ అని విశ్వకర్మ తన కుమార్తె సంజ్ఞాదేవిని ఆదిత్యునికిచ్చి పెండ్లి చేశాడు. వీరి మొదటి సంతానం శ్రాద్ధదేవుడు. ఇతనినే ‘వైవస్వత మనువు’ అంటారు. సూర్యుని తేజస్సు భరించలేక భర్తతో సుఖించేప్పుడు సంజ్ఞాదేవి కనులు మూసుకొన్నది. సూర్యునికి కోపం వచ్చింది. ‘అఖిల జనుల ఆయుష్షును నియంత్రించేవాడు కొడుకుగా పుడతా’డన్నాడు. అలా పుట్టినవాడే యముడు. ఈసారి ఆమె కళ్లు మూసుకోలేదు కానీ, భర్తను చంచలదృష్టితో చూస్తూండి పోయింది. ‘నీకు విలోలయైన కుమార్తె పుడుతుంద’న్నాడు సూర్యుడు. పుట్టిన కూతురు పేరు యమున.

‘ఏం చేసినా తప్పే, ఎలా వున్నా కష్టమే’ అన్నట్లుగా ఉన్నది సంజ్ఞ పరిస్థితి. ఆమె తన నీడకు ప్రాణం పోసి ‘ఛాయాదేవి’ అని పేరు పెట్టింది. ‘ముమ్మూర్తులా నీవు నాలానే వున్నావు. ఆయనకు అనుమానం రాకుండా నాకు వలెనే కాపురం చేయి. నా పిల్లల్ని నీ పిల్లలనుకో’ అంటూ అంపకాలు పెట్టి, పిల్లలకు కూడా చెప్పకుండా పుట్టింటికి వెళ్లింది సంజ్ఞ.
ఎన్నాళ్లయినా అత్తారింటి ఊసెత్తని సంజ్ఞను చూసి సందేహం వచ్చింది విశ్వకర్మకు. కూతురుకు సుద్దులు చెప్పి అత్తారింటికి పంపించాడు. భర్త వద్దకని బయల్దేరిన సంజ్ఞ కురుదేశాలకు వెళ్లి ‘బడబ’ నామంతో అశ్వరూపాన్ని ధరించి పచ్చిక బీళ్లలో విహరింప సాగింది. ఈ లోగా ఛాయకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల పుట్టారు. శ్రుతకర్మ, శ్రుతశ్రవుడు, తపతి వాళ్ల పేర్లు. శ్రుతశ్రవుడు తదుపరి కాలంలో ‘సూర్యసావర్ణి మనువు’గా పేరొందాడు. శ్రుతకర్మను మనందరమూ ‘శనీశ్వరుని’గా ఎరిగి వున్నాం. తపతి నదముగా ప్రసిద్ధురాలైంది. పిల్లలు పుట్టాక ఛాయకు సవతి తల్లి మనస్తత్వం వచ్చేసింది. సంజ్ఞ పిల్లలను వేరుభావంతో చూడసాగింది. యమునికి అనుమానం వచ్చి, ఛాయ నడవడిని పరికించసాగాడు. ఆమె తన తల్లి కాదని తెలుసుకొని దెబ్బలాట పెట్టుకున్నాడు. మాట మాట పెరిగింది. తల్లిని తన్నడానికి వెళ్లాడు యముడు. ‘నీ కాలు తెగిపడును గాక’ అని శపించింది ఛాయ. యముని కాలు తెగి నేలమీద పడింది. ఈ గొడవతో విషయం సూర్యుని వరకు వెళ్లింది. ‘తెగిపడిన కాలును క్రిములు తిని వేస్తాయని, తదుపరి యమునికి కాలు యథాతథంగా వస్తుందని, యముని కాలు తిని వేసిన క్రిములే లోకంలో వ్యాధులుగా వర్ధిల్లుతాయని, మానవులు రోగాల కారణంగా మరణిస్తుంటారు గనుక వారు యముణ్ణి నిందించరనీ’ వరమిచ్చాడు సూర్యుడు. ఈ గొడవలో శని తల్లిపక్షం వహించి తండ్రితో తగవు పెట్టుకొన్నాడు. శనిని ఇంటినుండి వెళ్లగొట్టాడు సూర్యుడు.
బడబ రూపంలో తిరుగుతున్న సంజ్ఞను కనుగొన్న సూర్యుడు ఆమెపట్ల మరులు గొన్నాడు. ఫలితంగా వారికి ‘అశ్వినీ దేవతలు’ కలిగారు. ఆ సందర్భంలోనే భూమిమీద పడ్డ సూర్యుని రేతస్సునుండి ‘రేవంతుడు’ పుట్టాడు. విషయం తెలిసిన విశ్వకర్మ కురుభూములను చేరుకున్నాడు. సంజ్ఞ పడుతున్న ఇబ్బంది అటు భర్తకు, ఇటు తండ్రికి అర్థమైంది. సూర్యుని తేజస్సును చిత్రిక పట్టి అతనిలోని వేడిమిని తగ్గించాడు విశ్వకర్మ. సంజ్ఞ తన భర్తతోపాటు సూర్యమండలానికి వెళ్లిపోయింది. చిత్రిక పట్టినప్పుడు సూర్యకిరణాల నుండి రాలిపడిన రజనుతో విష్ణుమూర్తికి చక్రాయుధాన్ని, శివునికి త్రిశూలాన్ని, వసువులకు శంఖాలను చేసిచ్చాడు విశ్వకర్మ. మరికొంత రజను మిగిలితే దానితో దేవేంద్రుని వజ్రాయుధానికి పదును పెట్టిచ్చాడు. కథ సుఖాంతమైంది.
వరిగొండ
కాంతారావు
94418 86824
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- Chinthana News
- Lord surya
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

