కార్వాన్ : టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిస్టల్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌కు ఆనుకొని ఉన్న ఓ స్థలంలో ఉన్న రెండు దుకాణాలను గుర్తు తెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి జేసిబీతో కూల్చివేశారు.
టప్పాచబుత్రా ఇన్స్పెక్టర్ జి. సంతోష్‌కుమార్‌తో పాటు స్థల యజమాని బాలయ్య తెలిపిన వివరాల ప్రకారం పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 86 కు సమీపంలో క్రిస్టల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో బాలయ్య అనే వ్యకికి చెందిన 192 గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో అతను రెండు దుకాణాలు నిర్మించి ఒకటి వైన్‌షాప్‌కు మరొకటి చికెన్ షాప్‌కు అద్దెకు ఇచ్చాడు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం క్రిస్టల్ గార్డెన్ తీసివేసి ఆ స్థలంలో మహావీర్ కన్స్ట్రక్షన్ పేరుతో నిర్మాణాలు చేస్తున్నారు. కాగా ఈ స్థలం పక్కన ఉన్నటువంటి బాలయ్యకు చెందిన స్థలంలో ఉన్న వైన్ షాప్‌ను, చికెన్ షాప్‌ను సోమవారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు జేసీబీతో సగం వరకు కూల్చివేశారు.
ఇది గమనించిన స్థానికుడు దుకాణందారులకు సమాచారం అందించడంతో వారు వచ్చే సరికి కూల్చివేసేందుకు వచ్చిన వారు అక్కడి నుండి పారిపోయారు. దీంతో బాధితులు టప్పాచబుత్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా వైన్ షాపులో ఉన్న 37 లక్షల విలువచేసే మద్యం నేలపాలయింది. కాగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.